విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
సుమారు 200 క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు..లక్షల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ అంతరాయం
ఉక్రెయిన్‌లో విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమారు 200 క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులకు పాల్పడింది. దీంతో లక్షల సంఖ్యలో ఇళ్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గడిచిన రెండువారాల్లో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌లపై భారీ దాడులకు పాల్పడం ఇది రెండోసారి కాగా.. ఈ ఏడాదిలో ఈ తరహా దాడి చేయడం 11వ సారి . దేశమంతటా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విద్యుత్ వ్యవహారాల శాఖ మంత్రి హెర్మన్ హలుష్‌చెంకో పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. శీతాకాలాన్ని రష్యా ఆయుధంగా వాడుకుంటున్నదని, ఉక్రెయిన్ పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే లక్ష్యంతోనే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. విద్యుత్ పునరుద్ధరణకు తమ ఇంజినీర్లు కృషి చేస్తున్నారని, సాధ్యమైనన్ని ప్రాంతాల్లో కంరెటు సరఫరా చేయడానికి యత్నిస్తున్నామని చెప్పారు.
శీతాకాలంలో ఉక్రెయిన్‌లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పడిపోతాయి. దీంతో తాగునీరు, వేడి వాతావరణం కోసం విద్యుత్ ఎంతో కీలకం. ఇదే సమయంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తున్నది. గత ఏడాది ఇదే సీజన్లో దాడులు చేసిన రష్యన్ సేనుల, తాజాగా చలికాలం మొదలవుతున్న సమయంలో క్షిపణులు, డ్రోన్లతో మళ్లీ దాడులకు దిగాయి. గురువారం ఒక్కరోజే 100 డ్రోన్లు, 90 క్షిపణులతో ఉక్రెయిన్‌లోని 17 లక్ష్యాలపై తమ సైన్యం దాడి చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.