గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అనారోగ్యం, ఇతర సమస్యలతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ తో కూడిన ఉత్తర్వులు సోమవారం విడుదల చేసింది. బహ్రేయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ దేశాల్లో 2023 డిసెంబర్ 7వ తేదీ తర్వాత మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తారు. తెలంగాణకు చెందిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు మాత్రమే ఎక్స్ గ్రేషియా ఇస్తారు. ఇందు కోసం గల్ఫ్ కార్మికుడి డెత్ సర్టిఫికెట్, క్యాన్సిల్ చేసిన పాస్ పోర్ట్, వర్క్ వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లేదా ఆయా దేశాల్లో పని చేసినట్టు ఏదైనా నిర్దారణ సర్టిఫికెట్ తో పాటు ఆయనపై డిపెండ్ అయిన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఎకౌంట్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అర్హులను ఎంపిక చేస్తారని, నేరుగా మృతుల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఎకౌంట్లలోనే నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. గల్ఫ్ లో కార్మికుడు మృతిచెందిన లేదా కుటుంబ సభ్యులు డెడ్ బాడీని రిసీవ్ చేసుకున్న ఆరు నెలల్లోపే ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.teluguglobal.com/pdf_upload/5-lakhs-ex-gratia-guidelines-go-1367072.pdf