మత స్వేచ్చ లేని దేశాల జాబితాలో భారత్ ను చేర్చకపోవడం పట్ల US కమిషన్ ఆగ్రహం
భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితులు గణనీయంగా దిగజారాయి. ఈ సంవత్సరంలో, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఇతర మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ జాతీయవాద ఎజెండాను ప్రోత్సహించే విధానాలను భారత ప్రభుత్వం అనుసరించింది. ”అని USCIRF తన నివేదికలో పేర్కొంది.
అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం "మత స్వేచ్చ విషయంలో ఆందోళన కలిగించే దేశాల" జాబితాలో భారతదేశాన్ని చేర్చకుండా US స్టేట్ డిపార్ట్‌మెంట్ కళ్లు మూసుకుందని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై US కమిషన్ (USCIRF) ఆగ్రహం వ్యక్తం చేసింది.
"నైజీరియా, భారతదేశాలను మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించే దేశాలుగా గుర్తించడంలో US విదేశాంగ శాఖ తీవ్ర వైఫల్యం చెందిందని, ఆ రెండు దేశాల్లో మతపరమైన స్వేచ్ఛ ఉల్లంఘనల తీవ్రతను గుర్తించి, మా సిఫార్సులను స్టేట్ డిపార్ట్‌మెంట్ అమలు చేయకపోవడంపై USCIRF తీవ్ర నిరాశ చెందింది, "అని కమిషన్ చైర్‌పర్సన్, నూరీ టర్కెల్ ఒక ప్రకటనలో తెలిపారు.
"విదేశాంగ శాఖ స్వంత రిపోర్టింగ్‌లో కూడా నైజీరియా, భారతదేశంలో తీవ్రమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
చైనా, పాకిస్తాన్, మయన్మార్‌లతో సహా 12 దేశాలను మత స్వేచ్ఛ విషయంలో తీవ్ర ఆందోళన కలిగించే దేశాలు"గా US ప్రకటించింది.
"ఈ రోజు, నేను బర్మా (మయన్మార్), పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, క్యూబా, ఎరిట్రియా, ఇరాన్, నికరాగ్వా, DPRK [డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా], పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్లను మత స్వేచ్చ వ్యతిరేకులుగా ప్రకటిస్తున్నాను. ఇవి మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించినందుకు 1998 అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం తీవ్ర ఆందోళనకరమైన దేశాలు, "అని యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం అన్నారు.
అల్జీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కొమొరోస్, వియత్నాంలను కూడా మతపరమైన స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించినందుకు బ్లింకెన్ ప్రత్యేక వాచ్ లిస్ట్‌లో ఉంచినట్టు ప్రకటించారు.
భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛ, సంబంధిత మానవ హక్కులు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని USCIRF ఆరోపించింది.
మరో వైపు భారతదేశంలో మత స్వేచ్ఛ "తీవ్రంగా దిగజారుతున్నట్లు" కమిషన్ గుర్తించడం ఇది వరుసగా నాలుగోసారి.
ఏప్రిల్‌లో, కమిషన్ భారతదేశాన్నిమత స్వేచ్చ విషయంలో "తీవ్ర ఆందోళన కలిగిన దేశం"గా గుర్తించాలని US స్టేట్ డిపార్ట్‌మెంట్‌కి సిఫార్సు చేసింది.
"2021లో భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితులు గణనీయంగా దిగజారాయి. ఈ సంవత్సరంలో, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఇతర మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూ జాతీయవాద ఎజెండాను ప్రోత్సహించే విధానాలను భారత ప్రభుత్వం అనుసరించింది. "అని తన నివేదికలో పేర్కొంది.
మత స్వేచ్చ విషయంలో USCIRF పరిశీలనలను భారతదేశం గతంలో తిరస్కరించింది, వాటిని పక్షపాతంతో కూడుకున్నవిగా భారత్ పేర్కొంది.
2020 నుండి, భారతదేశం 'కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్' కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికీ భారత్‌పై అంతర్జాతీయ మత స్వేచ్ఛపై US కమిషన్ సిఫార్సును ఆమోదించలేదు.