నేడు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇండియా తరపున ప్రెసిడెంట్ ముర్ము లండన్ చేరుకున్నారు. లాంకస్టెర్ హౌస్‌కు వెళ్లిన ముర్ము.. అక్కడ రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు.

Advertisement
Update:2022-09-19 08:05 IST

బ్రిటన్‌కు అత్యధిక కాలం రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. సెప్టెంబర్ 8న రాణి మరణించగా.. అప్పటి నుంచి బ్రిటన్‌లో 11 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. సోమవారం రాణి అంత్యక్రియలు ముగిసిన తర్వాత జాతీయ సంతాప దినాలు పూర్తవుతాయి. అంత్యక్రియల్లో పాల్గొనడానికి పలువురు దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు దాదాపు 500 మంది బ్రిటన్ చేరుకున్నారు. రాణికి తుది వీడ్కోలు పలకడానికి ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాణి అంతిమ యాత్రను చూసేందుకు 10 లక్షల మంది పౌరులు లండన్ చేరుకుంటారని అంచనా వేశారు. వీళ్లను అదుపు చేయడానికి అంతిమ యాత్ర జరిగే రహదారుల వెంబ‌డి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

సోమవారం ఉదయం 11 గంటలకు వెస్ట్ మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే వరకు ఊరేగింపు జరుగుతుంది. అక్కడి నుంచి వెల్లింగ్టన్ ఆర్చి వరకు అంతిమ యాత్ర సాగుతుంది. విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు రాణి పార్థీవ దేహం ఉన్న శవపేటికను తీసుకొని వెళ్తారు. చివరిగా కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో ఉన్న రాయల్ వాల్ట్‌లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే శవపేటికను ఉంచుతారు. అక్కడే రెండు నిమిషాలు మౌనం పాటించడంతో అంత్యక్రియలు పూర్తవుతాయి.

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇండియా తరపున ప్రెసిడెంట్ ముర్ము లండన్ చేరుకున్నారు. లాంకస్టెర్ హౌస్‌కు వెళ్లిన ముర్ము.. అక్కడ రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు. ఆ తర్వాత వెస్ట్ మినిస్టర్ హాల్‌లో ఉంచిన రాణి పార్థివదేహానికి ముర్ము నివాళులు అర్పించారు. రాణికి నివాళులు అర్పించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ కూడా వచ్చారు. రాణి కడసారి చూపు కోసం భారీగా పౌరులు కూడా వస్తున్నారు. వెస్ట్ మినిస్టర్ హాల్ వద్ద ఈ క్యూ దాదాపు 10 కిలోమీటర్లు ఉన్నది. అయితే బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటల వరకే వీరికి అనుమతి ఉంటుంది. రాణి అంత్యక్రియలను బ్రిటన్ సహా పలు దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ఎంపిక చేసిన 125 సినిమా థియేటర్లలో కూడా ప్రసారం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News