ఇరాన్ ప్రజల విజయం...మోరల్ పోలీసింగ్ రద్దు
ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం ప్రజాపోరాటానికి తలవంచింది. మోరల్ పోలీసు వ్యవస్థను రద్దు చేసింది. అయితే హిజాబ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మూడు నెలలుగా ఇరాన్ ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటానికి విజయం లభించింది. మోరల్ పోలీసు వ్యవస్థను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ ఆదివారం మొంతజెరి వెల్లడించారు
హిజాబ్ సరిగా ధరించలేదనే ఆరోపణతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహ్సా అమీని అనే యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేసి అనంతరం హత్య చేసిన నేపథ్యంలో ఇరాన్ యావత్తూ భగ్గున మండి పోయింది. ఆ రోజు నుంచి మహిళలు, పిల్లలు, వృద్దులు అనే తేడా లేకుండా ఇరాన్ ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసు కాల్పుల్లో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అందులో వంద మందికి పైగా పిల్లలున్నారు. వేలాది మంది జైళ్ళపాలయ్యారు.
అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గలేదు. మహిళలు బహిరంగంగా తమ హిజాబ్ లను కాల్చేశారు, తమ జుట్టును కత్తిరించుకున్నారు. ముస్లిం మతపెద్దల తలలపై తలపాగాలు విసిరి తమ ధిక్కారాన్ని ప్రదర్శించారు.
ఇరాన్ ప్రజల పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం ప్రజాపోరాటానికి తలవంచింది. మోరల్ పోలీసు వ్యవస్థను రద్దు చేసింది. అయితే హిజాబ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ విషయాన్ని ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మొంతజెరి వెల్లడించారు. ఇరాన్ పార్లమెంట్, న్యాయ వ్యవస్థ కూడా ఏళ్ళ నాటి హిజాబ్ చట్టాన్ని కూడా పరిశీలిస్తున్నాయని, ఈ చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయమై ఆలోచిస్తున్నాయని ఆయన తెలిపాడు. దీనిపై ఒకటి లేదా రెండు వారాలలో ఒక నిర్ణయం వస్తుందని ఆయన చెప్పారు.