మూఢ భక్తి : 47 మంది చావుకు కారణమైన పాస్టర్

కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు.

Advertisement
Update:2023-04-24 20:26 IST

మూఢ భక్తి 47 మంది ప్రాణాలను బలిగొంది. పాస్టర్ చెప్పిన మాటలు నమ్మి భక్తులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కఠిన ఉపవాసం ఆచరిస్తే పరలోక ప్రాప్తి లభిస్తుందని పాస్టర్ చెప్పిన మాటలు నమ్మిన అమాయక భక్తజనం అతడు చెప్పిన మాటలు ఆచరించారు. కఠిన ఉపవాసం పాటించి తమ శరీరాన్ని శుష్కింప చేసుకుని చివరికి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అత్యంత దారుణమైన ఈ సంఘటన కెన్యాలో జరిగింది.

కిల్ఫీ ప్రావిన్స్ లోని గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చిలో ఒక పాస్టర్ ఏసుప్రభును కలుసుకోవాలంటే కఠినమైన ఉపవాసం చేయాలని తన వద్దకు వచ్చే భక్తులకు సూచించాడు. కఠిన ఉపవాసం పాటించి ఆకలితో అలమటించి చనిపోతే పరలోక ప్రాప్తి లభిస్తుందని భక్తులకు పాస్టర్ పదేపదే నూరి పోశాడు. పాస్టర్ చెప్పిన మాటలు నిజమని నమ్మిన చాలా మంది భక్తులు కఠిన ఉపవాసం పాటించడం ప్రారంభించారు.

అలా కఠిన ఉపవాసం ప్రారంభించిన 47 మంది చివరికి తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరినీ పాస్టర్ తెల్లటి ప్లాస్టిక్ షీట్ లో చుట్టి షాకహోలా అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టించాడు. అయితే అటవీ ప్రాంతంలో తరచూ శవాలు పూడ్చి పెట్టడం గమనించిన కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఈనెల 11వ తేదీన అటవీ ప్రాంతానికి చేరుకొని తవ్వకాలు చేపట్టారు. అయితే తవ్వకాలు జ‌రిపినా కొద్దీ శవాలు బయటపడుతుండటంతో పోలీసులు విస్తుపోయారు. తవ్వకాలు మరింత విస్తృతం చేయగా మొత్తం 47 మృతదేహాలు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి చనిపోయిన వ్యక్తుల వివరాలు కనుగొన్నారు. అందరూ ఒకే తీరున మృతి చెందడంపై ఆరా తీశారు. వీరందరూ ఒకే పాస్టర్ వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసేవారని తెలుసుకున్నారు.

పోలీసులు పాస్టర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అతడు అసలు విషయాన్ని బయట పెట్టాడు. కఠిన ఉపవాసం చేపట్టడంతోనే భక్తులు చనిపోయినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇంకా ఎవరైనా ఇటువంటి ఉపవాసంలో ఉన్నారా? అని అడిగి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ భక్తులను కలువగా వారిలో చాలామంది ఉపవాసం ఆచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ భక్తుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మూఢ భక్తి కారణంగా ఏకంగా 47 మంది తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News