విమాన ప్రమాదం ఘటన.. 179 మంది మృతి
ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరగిందని సిబ్బందిలో ఇద్దరు మినహా మిగతా వారంతా మృతి
దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మృతి చెందారు. విమానంలో ప్రయాణించిన 179 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఆరుగురు సిబ్బందిలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బైటపడినట్లు చెప్పారు. రన్‌వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొని పేలింది. దీంతో భారీగా మంటలు వచ్చాయి. 7C2216 విమానం బ్యాంకాక్ నుంచి ముయూన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ విమానం అప్పటికే ల్యాండింగ్‌కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. ఇది నేలపైకి దిగిన తర్వాత రన్‌వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్‌పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు.
విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదైనా పక్షిని డీకొనడం వల్ల అవి పనిచేయకపోవచ్చనే అనుమానాలున్నాయి. దీనిని బలపరిచేలా విమానం ల్యాండింగ్ ప్రయత్నించే సమయంలోల ఓ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బైటికి వచ్చిన దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానల్ ప్రసారం చేసింది.
దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ హైయూన్ మాట్లాడుతూ.. విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వీడియో దృశ్యాల్లోనూ విమానం రన్‌వేపై అదుపు తప్పి దూసుకెళుతూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కే ఉన్నట్లు భావిస్తున్నారు. జరిగిన ప్రమాదానికి థాయ్‌లాండ్ చెంది జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొన్నది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతి పెద్ద ప్రమాదం.