బుల్లెట్ ట్రైన్లే కాదు.. బుల్లెట్ స్పీడ్ తో జైళ్లు కూడా!
కొత్తగా 200 జైళ్లు నిర్మిస్తోన్న చైనా సర్కారు
చైనా ప్రభుత్వం బుల్లెట్ కన్నా వేగంగా దూసుకపోయే ట్రైన్లు మాత్రమే కాదు.. అంతే స్పీడ్ తో జైళ్లు కూడా నిర్మిస్తోంది. అభివృద్ధిలో తమ దేశాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రపంచం మొత్తం అబ్బురంగా తమకేసి చూసేలా చేస్తున్న చైనా దేశాధినేత జిన్‌పింగ్ స్వదేశంలో తనకు వ్యతిరేకంగా కొట్లాడే వారిని నిర్బంధించేందుకు ఏకంగా 200 జైళ్లు నిర్మిస్తున్నారు. సీఎన్‌ఎన్ ఈ జైళ్ల నిర్మాణం గురించి స్పెషల్ స్టోరీ ప్రసారం చేసింది. ఈ జైళ్లను లియుజూ సెంటర్లుగా పిలుస్తారట? తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని ఈ కేంద్రాలకు తరలిస్తే ఇక అంతే సంగతి.. వాళ్లు కనీసం ఆరు నెలల పాటు తమ వాళ్లెవరినీ కలవడానికి చాన్స్ ఉండదు.. న్యాయం కోసం ప్రయత్నించడానికి అవకాశం ఉండదు.. వరుసగా మూడోసారి చైనా పాలన పగ్గాలు దక్కించుకున్న జిన్‌పింగ్ మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అవినీతిపై పోరాడే వారిని జైళ్లలో నిర్బంధిస్తారనే ప్రచారం ఉంది. ఆయా జైళ్ల వద్ద 24 గంటల పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థ, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వాన్ని, తనను విమర్శించే వాళ్లే కాదు.. ప్రభుత్వంలో ఉంటూ ఏదైనా పొరపాట్లు చేసే వాళ్లు.. తన ప్రత్యర్థులకు ఉప్పందించే వాళ్లను కూడా ఈ జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఖైదీలకు హక్కులుంటాయి. కానీ కమ్యూనిస్టు దేశమైన చైనాలో మాత్రం జైళ్లలో నిర్బంధించిన వారికి ఎలాంటి హక్కులు ఉండవు. వాళ్లు కనీసం పడుకోవడానికి కూడా సదుపాయాలు ఉండవు. రోజులో 18 గంటలు కూర్చునే ఉండాలని సీఎన్‌ఎన్ తన కథనంలో వెల్లడించింది.