హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగించాం.. ఇక శత్రువుల పని పడుతాం
అమెరికా, దక్షిణ కొరియాను ఉద్దేశించి కిమ్ జోంగ్ ఉన్
హైపర్ సోనిక్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించామని.. అది పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పని పడుతుందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ కొరియాలను ఉద్దేశించి కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా సోమవారం ఈ ప్రయోగం చేసింది. కిమ్ స్వయంగా ఈ ప్రయోగాన్ని చూశారు. క్షిపణి శబ్దం కన్నా 12 రెట్లు వేగంతో 1,500 కి.మీ.లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ వెల్లడించారు. తమ ఆత్మరక్షణ కోసమే ఈ క్షిపణిని ప్రయోగించామని, ఎంతటి రక్షణ వ్యవస్థలనైనా ఛేదించుకొని దూసుకెళ్లి ప్రత్యర్థిపై దాడి చేయగలదని తెలిపారు. తమ దేశ రక్షణ శక్తిసామర్థ్యాలు పెంచుకుంటామని తెలిపారు. కిమ్ తన కుమార్తె జు ఏతో కలిసి మిస్సైల్ టెస్టింగ్ ను తిలకిస్తున్న ఫొటోను ఉత్తర కొరియా విడుదల చేసింది. ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగాన్ని అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి.