ట్రంప్, హారిస్ క్యాంపెయిన్‌పై డ్రాగన్ పంజా!
వీరి ప్రచారంపై చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్‌లు ప్రచారాన్ని ఉధృతం చేశారు. అయితే వీరి ప్రచారంపై చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్లు సమాచారం. వీరి క్యాంపెయిన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తులు వినియోగించే ఫోన్లను డ్రాగన్ సైబర్ ముఠా హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఫోన్లను టార్గెట్ చేశారా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు.
డొనాల్డ్ ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఉపయోగిస్తున్న ఫోన్ల నుంచి చైనా హ్యాకర్లు డేటాను దొంగిలిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. వీరితోపాటు కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాజ్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నది. వెరిజోన్ ఫోన్ స్టిస్టమ్‌లోకి చొరబడి హ్యాకర్లు సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి యత్నించినట్లు సదరు కథనం తెలిపింది.
ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి అమెరికా టెలీ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్లను విదేశీ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు మాకు తెలిసింది. దీన్ని దర్యాప్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వెరిజోన్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ ముఠా 'సాల్ట్ టైఫూన్' ఈ హ్యాకింగ్‌కు పాల్పడి ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.