ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిస‌లాట‌.. 130 మంది మృతి!

ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.

Advertisement
Update:2022-10-02 14:00 IST

ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సంద‌ర్భంగా జరిగిన హింసాకాండలో 130 మంది మరణించ‌గా దాదాపు 180 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు జావాలో జరిగిన ఒక మ్యాచ్ తర్వాత, ఓటమి పాలైన జ‌ట్టు అభిమానులు కోపోద్రిక్తులై ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడ్డారు. దీంతో భారీగా తొక్కిస‌లాట జ‌రిగింది. అల్ల‌ర్ల‌కు దిగ‌డంతో వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. త‌ప్పించుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వారు గ్యాస్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఫ‌లితంగా ఆక్సిజ‌న్ అంద‌క మ‌ర‌ణించారు. బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండగా కొంద‌రు, ఆస్ప‌త్రిలో మ‌రి కొంద‌రు మ‌ర‌ణించార‌ని వార్తా సంస్థ‌లు తెలిపాయి.

బాధితుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఊపిరాడ‌క స్టేడియంలోనే 34 మంది మ‌ర‌ణించార‌ని తూర్పు జావా పోలీసు హెడ్ నికో అఫింటా తెలిపారు. ఇండోనేషియాలో అరేమా - పెర్సెబయా జ‌ట్ల మధ్య మ్యాచ్ జ‌రిగింది.ఈ మ్యాచ్ పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది.

పోలీసులు భారీగా టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌డ‌మే పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌డంతో ఈ ఘ‌ట‌న‌పై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News