ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం
జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ ఎస్ ఎల్) అనే సంస్థలో బోల్ట్ పెట్టుబడులు పెట్టాడు. అతని ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి 12 వేల డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించింది.
జమైకాకు చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌కు భారీ షాక్ తగిలింది. రూ.103 కోట్ల భారీ ఆర్థిక మోసానికి గురయ్యాడు. ఒక ప్రైవేటు పెట్టుబడి సంస్థలో కొన్నేళ్ల కిందట ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ తెరిచిన బోల్ట్.. రిటైర్మెంట్, లైఫ్‌టైం సేవింగ్స్‌లో భాగంగా ఈ అకౌంట్ కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈ అకౌంట్ నుంచి ఆ సంస్థకు చెందిన ఉద్యోగే మోసానికి పాల్పడి సొమ్ము కాజేసినట్టు చేసినట్టు తెలిసింది.
జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ ఎస్ ఎల్) అనే సంస్థలో బోల్ట్ పెట్టుబడులు పెట్టాడు. అతని ఖాతాలో 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి 12 వేల డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించింది. మొత్తం 12.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.103 కోట్లకు పైగానే) ఖాతా నుంచి మాయమయ్యాయి.
సదరు సంస్థ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్.. ఈ మోసాన్ని ఈనెల ప్రారంభంలోనే గుర్తించినట్టు తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత చర్యల కారణంగా తమ క్లయింట్ల ఖాతాల్లో నుంచి మిలియన్ల డాలర్ల మొత్తం మాయమైనట్టు ఆ కంపెనీ జనవరి 12న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉసేన్ బోల్ట్ సహా దాదాపు 30 మంది ఖాతాదారులు తమ డబ్బు కోల్పోయినట్టు ఆ సంస్థ పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకుంటామని ఈ సందర్భంగా ఆ సంస్థ వెల్లడించింది.
ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ స్పందిస్తూ.. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో సంస్థపై చర్యలు చేపట్టారు. సంస్థ మేనేజ్‌మెంట్ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వ అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌లో బోల్ట్ ఎనిమిది బంగారు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 2017లో అతను అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికాడు.