ఇండోనేషియాలో భారీ భూకంపం - 50 మంది మృతి.. 1000 మందికి గాయాలు
Earthquake in Indonesia: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూకంపం ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. అనేక మంది భవనాల శిథిలాల్లో చిక్కుకుని ఉన్నారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు సంభవించిన భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో 50 మంది మృతి చెందారు. మరో 1000 మంది గాయపడ్డారు.
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూకంపం ప్రభావంతో భవనాలు కుప్పకూలాయి. అనేక మంది భవనాల శిథిలాల్లో చిక్కుకుని ఉన్నారు. ఆస్పత్రికి తరలించినవారిలోనే 20 మంది మృతి చెందారు. మరో 30 మంది శిథిలాలకిందనే మరణించినట్టు అధికారులు తెలిపారు. 1000 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు.
భవనాల శిథిలాల కింద ఉన్నవారిలో ఇంకెంత మంది బాధితులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంటుందని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెబుతున్నారు.
బాధితులను కాపాడేందుకు, శిథిలాల్లో ఉన్నవారిని బయటికి తీసేందుకు అక్కడి అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.