అణ్వాయుధాలు సిద్ధం.. ప్రయోగించడానికి వెనుకాడం.. - నాటో దేశాలకు బెలారస్ హెచ్చరిక
నాటో దళాల మోహరింపులతో బెలారస్ సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన సమయంలో ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రభుత్వ రంగ వార్తా సంస్థ బెల్టా వద్ద ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత మరోసారి అణుబాంబు ప్రభావాన్ని, దాని ప్రభావంతో ఏర్పడే ఉత్పాతాన్ని ప్రపంచం చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయా.. అంటే అది నిజమేననిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఎడతెగకుండా పోరు కొనసాగుతుండటంపై అసహనానికి గురవుతున్న రష్యా అవసరమైతే అణుబాంబును ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ విషయంలో సంయమనం పాటిస్తున్న రష్యా.. ఇప్పుడు బెలారస్ రూపంలో అణుబాంబు దాడికి సిద్ధమవుతోందా అనిపిస్తోంది. బెలారస్ తాజాగా చేసిన హెచ్చరికలే దీనికి నిదర్శనంగా కనబడుతున్నాయి.
తమ దేశంపై విదేశీ దాడులు జరిగితే మాత్రం రష్యా నుంచి తీసుకొన్న అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకాడబోమని బెలారస్ (Belarus) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో (Lukashenko) ప్రకటించారు. నాటో దళాల మోహరింపులతో సరిహద్దులు ఉద్రిక్తంగా మారిన సమయంలో ఆయన ప్రభుత్వ రంగ వార్తా సంస్థ బెల్టా వద్ద ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజాగా బెల్టాతో లుకషెంకో మాట్లాడుతూ ఉక్రెయిన్ సేనలు హద్దులు దాటనంత వరకూ తమ దేశం ఈ యుద్ధంలో భాగస్వామి కాదని తెలిపారు. కానీ, తమ మిత్రదేశమైన రష్యాకు మాత్రం సాయం చేయడం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఒక వేళ నాటో దేశాలైన పోలాండ్, లిథువేనియా, లాత్వియా వంటి దేశాలు కవ్విస్తే మాత్రం బెలారస్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలతో సహా సర్వశక్తులతో స్పందిస్తుందని స్పష్టం చేశారు. అంతేకానీ, తాము భయపడి దాక్కోవడం, ఎదురు చూడటం వంటివి చేయబోమని సూటిగా హెచ్చరించారు. తాము ఎవరినో బెదిరించడానికి ఇక్కడికి అణ్వాయుధాలు తీసుకురాలేదని, అవి ప్రత్యర్థులను బాగా భయపెడతాయన్నది మాత్రం నిజమని ఆయన చెప్పారు. ఇవి చిన్న అణ్వాయుధాలేనని.. పెద్దవి కాదని, అందుకే తమపై దాడి మొదలు పెట్టిన తక్షణమే వాటిని వాడతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో బెలారస్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ దేశాన్ని మాస్కో ఓ లాంచ్‌ప్యాడ్‌లా ఉపయోగించుకుంటోంది. గతేడాది రష్యా దళాలతో కలిసి బెలారస్ సేనలు యుద్ధ విన్యాసాలు చేశాయి. అప్పుడే ఇవి కూడా ఉక్రెయిన్‌పై దాడిలో భాగస్వాములవుతాయని అందరూ భావించారు. ఈ ఏడాది జూన్‌లో రష్యా నుంచి కొన్ని అణ్వాయుధాలను రక్షణ కోసం బెలారస్‌కు తరలించారు. ఈ విషయాన్ని వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. దీనిలో సందేహించాల్సిన అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు రష్యా నుంచి ఎన్ని అణ్వాయుధాలు సరిహద్దులు దాటి బెలారస్ చేరాయన్న విషయంపై ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు పశ్చిమ దేశాలు కూడా బెలారస్ వద్ద అణ్వాయుధాలున్న విషయాన్ని ధ్రువీకరించడం లేదు. దీనికి తోడు అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంచనా ప్రకారం ఒకవేళ బెలారస్‌లో అణ్వాయుధాలున్నా.. వాటిపై లుకషెంకో నియంత్రణ ఉండదు.. పూర్తిగా రష్యా ఆధీనంలోనే ఉంటాయి.
ఈ పరిణామం చూస్తుంటే ప్రపంచం మరోసారి అణ్వాయుధాల వల్ల ఏర్పడే ఉత్పాతాలను చవిచూసే పరిస్థితి వస్తుందా అనే అనుమానం కలుగుతోంది. బెలారస్ చేసిన ప్రకటనపై నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఇక్కడ కీలకంగా మారింది. అవి బెలారస్ హెచ్చరికల విషయంలో సంయమనం పాటించడం మంచిదనేది శాంతికాముకుల అభిప్రాయంగా కనబడుతోంది. దీనికితోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అణ్వాయుధాలను ప్రయోగించడం సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.