ప్రధాని మోడీకి కువైట్ అత్యున్నత పురస్కారం
'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్' తో సత్కరించిన కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-బాజెర్ అల్-సబా
ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్' తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-బాజెర్ అల్-సబా ఈ అవార్డును అందజేశారు. వివిధ దేశాల నుంచి ప్రధాని మోడీకి లభించిన 20వ అంతర్జాతీయ అవార్డు ఇది. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబం సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు దీన్ని అందుకున్నారు.
కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఆదివారం ఆ దేశ ఎమిర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతోపాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకస్థాయికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబాతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు నిర్వహించారు. అంతకుముందు బయాన్ ప్యాలెస్‌లో గౌరవ వందనం స్వీకరించారు.