కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు
ఎన్నికల వేళ అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమన్వయ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పలు జరిపారు. కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికి నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అర్దరాత్రి కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.
ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వరుస కాల్పులు జరిగాయి. రెండు నెలల కింద పెన్సిల్వేనియా ఘటనలో ట్రంప్ ప్రసంగిస్తుంగా కాల్పులు జరిగాయి. ఇటీవల ఫ్లోరిడాలోని ఫెస్ట్ ఫామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. అతడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా కమలా హారిస్ కార్యాలయంపై కాల్పులు జరగడం కలకలం సృష్టించింది.అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. అభ్యర్థులుగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఈక్రమంలో అభ్యర్థులపై కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి.
ముప్పు పొంచి ఉన్నది జాగ్రత్త
ఇరాన్ నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ముప్పు పొంచి ఉన్నదని యూఎస్ ఇంటలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. యూఎస్‌లో గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా దూరం జరగాలి: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా దూరం జరగాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు ఆ ఆలోచనే లేదని విమర్శించారు. ఉక్రెయిన్‌లో అమెరికా బలగాలు లేకపోయినా మిలటరీ, మానవతా రూపంలో బిలియన్ల డాలర్ల సాయం అందుతున్నదని వ్యాఖ్యానించారు.