అనుభవ పాఠాలతో ముందడుగు వేసిన ఇస్రో..

చంద్రయాన్‌-2 పంపిన అద్భుతమైన చిత్రాల ఆధారంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. చంద్రయాన్‌-2లో సాఫ్ట్‌వేర్‌, గైడెన్స్‌ అల్గోరిథమ్‌ వైఫల్యాలు తలెత్తాయి.

Advertisement
Update:2023-08-22 15:18 IST
అనుభవ పాఠాలతో ముందడుగు వేసిన ఇస్రో..
  • whatsapp icon

జాబిల్లిపై ఇప్పటివరకు ఏ దేశమూ చేరుకోని దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను సురక్షితంగా ల్యాండ్ చేయ‌డం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. చంద్రయాన్‌-2 మిషన్‌లో జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడంలో విఫలమైన ఇస్రో ఈసారి ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఇందుకోసం చంద్రయాన్‌-2లాగ సక్సెస్‌ బేస్డ్‌ మోడల్‌ కాకుండా చంద్రయాన్‌-3ని ఫెయిల్యూర్‌ బేస్డ్‌ డిజైన్‌తో రూపొందించింది. వైఫల్యాలకు ఉన్న అవకాశాలను విశ్లేషించుకొని, వాటిని అధిగమించేలా రూపొందించింది. ఒకేసారి అన్ని సెన్సార్లూ పనిచేయకపోయినా, నాలుగింట్లో రెండు ఇంజన్లు విఫలమైనా జాబిల్లిపై సురక్షితంగా దిగేలా దీనిని తీర్చిదిద్దారు. అందుకే ఈసారి చరిత్ర సృష్టించడం ఖాయమని ఇస్రో కృతనిశ్చయంతో ఉంది.


చంద్రయాన్‌-2 వైఫల్యానికి ప్రధాన కారణం- ఇంజన్లు అధిక థ్రస్టును ఉత్పత్తి చేయడమే. అందులోని నియంత్రణ వాల్వ్‌ సరైన సమయానికి సరైన రీతిలో ప్రతిస్పందించలేదు. దాన్ని ఇప్పుడు సరిచేశారు. కంట్రోల్‌ లాజిక్‌ను మెరుగుపరిచారు. చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌కు 500 బై 500 మీటర్ల ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఈసారి దీనిని బాగా పెంచారు. ఒకవేళ నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగలేకపోతే చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ప్రత్యామ్నాయాలు వెతుక్కొని, అవసరమైతే 150 మీటర్ల వరకూ పక్కకు వెళ్లగలదు. ఇందుకు అనుగుణంగా బ్యాటరీల సామర్థ్యం, ఇంధనం పరిమాణాన్ని పెంచారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సౌకర్యాన్నీ కల్పించారు.

చంద్రయాన్‌-2 పంపిన అద్భుతమైన చిత్రాల ఆధారంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు. చంద్రయాన్‌-2లో సాఫ్ట్‌వేర్‌, గైడెన్స్‌ అల్గోరిథమ్‌ వైఫల్యాలు తలెత్తాయి. ఫలితంగా ఓ దశలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంగా ల్యాండర్‌ ప్రయాణించి జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆ వ్యవస్థలను పటిష్టం చేశారు. ల్యాండింగ్‌ చివరి అంకంలో 3 మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఒక్క‌సారిగా కింద పడిపోతుంది. అదికూడా ఎగుడు దిగుడుగా ఉండే ఉపరితలంపై అప్పుడు చెలరేగే కుదుపును తట్టుకొనేలా సర్దుబాటు కాళ్లను డిజైన్‌ చేశారు. పాదం భాగాన్ని డాంపర్‌ పదార్థంతో తయారుచేశారు. తేనెతుట్టెలా ఉండే ఈ భాగం కుదుపులో చాలా భాగాన్ని గ్రహించుకుంటుంది.




అలాగే మరిన్ని కమ్యూనికేషన్‌ యాంటిన్నాలను చంద్రయాన్‌-3 ల్యాండర్‌కు అమర్చారు. ఫలితంగా.. వ్యోమనౌక దృక్కోణం ఎటువైపు ఉన్నా కంట్రోల్‌ సెంటర్‌తో కమ్యూనికేషన్‌ కొనసాగుతుంది. ల్యాండింగ్‌ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై ఎదురయ్యే అవరోధాలను గుర్తించి, వాటి నుంచి పక్కకు జరిగే అటానమస్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ విన్యాసంలో అవి ఉపయోగపడతాయి. ల్యాండర్‌లోని కృత్రిమ మేధ వీటిని ప్రాసెస్‌ చేసి నేవిగేషన్‌, గైడెన్స్‌ ఇస్తుంది.

*

Tags:    
Advertisement

Similar News