సంధి దిశగా ఇజ్రాయెల్- హమాస్ అడుగులు
గాజాల్లో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ ప్రకటన
సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకున్నది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాజాల్లో కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో తమ స్పై చీఫ్ పాల్గొంటారని ఇజ్రాయెల్ పేర్కొన్నది. మరోవైపు ఒప్పందం కుదిరితే పోరాటం ఆపేస్తామని హమాస్ వర్గాలు కూడా వెల్లడించాయి.
దోహాకు చెందిన ఓ అధికారి ప్రతినిధి బృందం కైరోలో ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించినట్లు హమాస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియా సంస్థకు తెలిపారు. 'హమాస్ పోరాటాన్ని ఆపేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి. యుద్ధం నేపథ్యంలో గాజా నుంచి వెళ్లిపోయిన ప్రజలను తిరిగి అనుమతించాలి. ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అంగీకరించడంతో పాటు గాజాకు అందే మానవతా సాయానికి అడ్డు తొలగాలి' అని ఆయన వెల్లడించారు.
మరోవైపు 'బందీలను విడుదల చేయడానికి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతిస్తున్నాం' అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కైరో సమావేశం అనంతరం ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ గూఢాచార సంస్థ అధిపతిని అజెండాలోని ముఖ్యమైన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఖతార్‌కు వెళ్లాలని ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. అయితే గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడులకు సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్ ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిన్వర్ మరణం ఓ ఒప్పందానికి దారితీస్తున్నదని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా చర్చలు జరుగుతుండటం విశేషం.