ఇజ్రాయెల్‌-పాలస్తీనా వార్‌.. 20 నిమిషాలు, 5 వేల రాకెట్లు

హమాస్‌ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ ఐరన్‌ స్వార్డ్స్‌ను స్టార్ట్ చేసింది. గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి.

Advertisement
Update:2023-10-07 16:04 IST

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఉదయం ఒక్కసారిగా గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లు ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా దూసుకొచ్చాయని సమాచారం. మరోవైపు పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లో చొరబడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం కౌంటర్‌ అటాక్ స్టార్ట్ చేసింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెల‌కొందని ఆ దేశ సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హమాస్‌ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూప్‌ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది.

ఇక ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు ప్రకటించారు హమాస్‌ మిలిటరీ విభాగం హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌. శనివారం తెల్లవారుజామునే ఆపరేషన్‌ ఆల్‌ అక్సా స్ట్రామ్‌ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5 వేల రాకెట్లను ప్రయోగించినట్లు వీడియోలో రిలీజ్ చేశాడు. డెయిఫ్‌పై గతంలో అనేక దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయిన అతడు.. ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.

తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందించింది. హమాస్‌ ఘోర తప్పు చేసిందని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హమాస్‌ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ ఐరన్‌ స్వార్డ్స్‌ను స్టార్ట్ చేసింది. గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులు పలువురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెర‌గ‌వ‌చ్చ‌ని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య వివాదం ఇప్పటిది కాదు. దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. అయితే 1967 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో అప్పటినుంచి పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News