ఇరాన్‌లో 66.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
సాధారణంగా వేసవిలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే మనం ఆపసోపాలు పడుతుంటాం. ఆ వేడికి తాళలేక ఎండాకాలం ఎప్పుడు ముగుస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఇరాన్‌లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత గురించి తెలుసుకుంటే.. విస్తుపోవాల్సిందే. ఇరాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఉష్ణోగ్రత 66.7 డిగ్రీల సెల్సియస్‌గా చూపించడం గమనార్హం. అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌లో నమోదైన ఉష్ణోగ్రత, ఆ తాపాన్ని మానవులు, జంతువులు భరించగలిగే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు.
వాతావరణం ఎంత వేడిగా ఉంది.. ఎంత చల్లగా ఉందనే విషయాన్ని లెక్కించేందుకు శాస్త్రవేత్తలు గాలిలో ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ పద్ధతుల్లో ఉష్ణ సూచిక ఒకటి. ఈ విధానంలో గాలి ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా ఉష్ణోగ్రతను అంచనా వేస్తారు. పర్షియన్ గల్ఫ్ లోని చాలా వెచ్చని నీటిపై ప్రవహించే తేమతో కూడిన గాలి.. లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో ఇరాన్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదైందని సమాచారం.
మానవులపై తీవ్ర ప్రభావం...
ఇలాంటి వేడి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. తగినంత నీరు తీసుకోకపోతే చెమట, మూత్రం రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళ్లి డీ హైడ్రేషన్‌కు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. రక్తం చిక్కబడి.. అది గడ్డకట్టే స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. దాంతో గుండెపోటు, పక్షవాతం కూడా రావొచ్చని వెల్లడించారు. అప్పటికే అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు ఈ వాతావరణం మరింత ప్రమాదకరమని హెచ్చరించారు.