అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. క్లేవ్‌లాండ్‌లో కొంతకాలం కిందట అదృశ్యమైన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) శవమై కనిపించాడు. ఈవిషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
నెలకిందట అదృశ్యం
క్లేవ్‌లాండ్ యూనివర్సిటీలో ఐటీ మాస్టర్స్ చేస్తున్న అబ్దుల్ గత నెల 7న అదృశ్యమయ్యాడు. కొంత మంది వ్యక్తులు ఫోన్ చేసి అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామని, 1200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అతని తండ్రి మహమ్మద్ సలీం చెప్పారు. ఇవ్వకపోతే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారన్నారు. డబ్బులు పంపిస్తాను.. అబ్దుల్ మీ దగ్గరే ఉన్నట్లు ఆధారాలు చూపాలని తాను అడగ్గానే కిడ్నాపర్లు ఫోన్ పెట్టేశారని, అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ తెలియలేదని సలీం వెల్లడించారు.
పోలీసులకు ఫిర్యాదు
ఆ వెంటనే హైదరాబాద్‌లో ఉన్న సలీం క్లేవ్‌లాండ్‌లో ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అబ్దుల్ ఆచూకీ తెలియలేదు. సరిగ్గా నెల రోజుల తర్వాత అతని మృతదేహం కనిపించింది.