చ‌ర్చ‌లు ఫ‌లించేనా..? వివాదానికి తెర‌ప‌డేనా..?

సరిహద్దుల్లో పదేపదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న డ్రాగన్‌ను భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే మరోవైపు చైనా.. భారత్‌తో చర్చలు కొనసాగిస్తోంది.

Advertisement
Update:2023-08-13 09:36 IST

భారత్‌-చైనా మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా 19వ సారి కమాండర్ల చర్చలు సోమవారం జరగనున్నాయి. గల్వాన్ ఘర్షణతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తవాంగ్‌లోనూ ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న భారత్-చైనా సరిహద్దు వివాదానికి ఈసారైనా ముగింపు పలకాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. కానీ బోర్డర్‌లో దుందుడుకుగా వ్యవహరిస్తున్న డ్రాగన్‌... సరిహద్దుల్లో బలగాల ఉప సంహరణకు అంగీకరిస్తుందా లేదా అన్నది ఈ చర్చల్లో తేలిపోనుంది.

సరిహద్దుల్లో పదేపదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న డ్రాగన్‌ను భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే మరోవైపు చైనా.. భారత్‌తో చర్చలు కొనసాగిస్తోంది. ఇప్పటికే దాదాపు 18 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల ఫలితంగా ఇరు దేశాలు క్రమంగా సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి. కానీ... మధ్యలో మళ్లీ చైనా దుందుడుకుగా వ్యవహరించడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. అయితే ఉద్రిక్తతలు మరింత ముదరకుండా చర్చలతోనే వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భారత్ భావిస్తోంది. అందుకే మరోసారి చైనాతో చర్చలకు సిద్ధమైంది.

వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సైన్య ఉపసంహరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న భారత్‌-చైనా కోర్‌ కమాండర్ల స్థాయి 19వ విడత చర్చలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఇప్పటికే జరిగిన చర్చలతో చాలా ప్రాంతాల్లో ఉపసంహరణ ప్రక్రియ ముగిసినా.. దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌ వంటి కొన్ని కీలక పాయింట్ల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు చైనా ససేమిరా అంటోంది. వీటిపైనే చర్చ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా 18వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి.

తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని చైనాకు భారత్‌ స్పష్టం చేయనుంది. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుంది. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్‌చోక్‌ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసింది. తాజా చర్చలు చుషుల్‌–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ రషీమ్‌ బాలి, చైనా కు సౌత్‌ జిన్‌జియాంగ్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ నాయకత్వం వహిస్తారు.

Tags:    
Advertisement

Similar News