పాక్ ఉప ఎన్నికల్లో 33 ఎంపీ స్థానాల్లోనూ ఇమ్రాన్ ఒక్కడే పోటీ
ఇమ్రాన్ ఆదేశాల మేరకు నేషనల్ అసెంబ్లీలోని పీటీఐ సభ్యులందరూ రాజీనామా చేశారు. ఇప్పటివరకు 70 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనుండగా, తమ పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) నుంచి అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఒక్కడే పోటీ చేయనున్నాడు. ఈ మేరకు ఆదివారం జరిగిన పీటీఐ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు పార్టీ ఉపాధ్యక్షుడు షా మహమూద్ ఖురేషీ వెల్లడించారు.
ముందస్తు ఎన్నికల విషయంలో అధికార కూటమిపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓటమి చెందిన ఇమ్రాన్ ప్రధాని పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇమ్రాన్ ఆదేశాల మేరకు నేషనల్ అసెంబ్లీలోని పీటీఐ సభ్యులందరూ రాజీనామా చేశారు. ఇప్పటివరకు 70 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి తొలుత 33 చోట్ల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పుడు ఈ అన్ని స్థానాల్లోనూ ఇమ్రాన్ ఒక్కడే పోటీ చేయనున్నాడు.