పాఠశాలల నుంచి 280 మంది చిన్నారుల కిడ్నాప్‌

నైజీరియాలో బందిపోట్లు ఇలా పాఠశాలలపై దాడులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. వాయవ్య, మధ్య ప్రాంతాల్లో అయితే ఈ ఘటనలు మరీ ఎక్కువ.

Advertisement
Update:2024-03-08 18:53 IST

ఆయుధాలతో ఉన్న ముఠాలు పాఠశాలలపై దాడిచేసి 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్‌ చేసిన ఘటన నైజీరియాలో గురువారం జరిగింది. అక్కడి కడునా రాష్ట్రంలో గల చికున్‌ జిల్లాలోని పాఠశాలల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇలాంటి ఘటనలు సాధారణంగానే జరుగుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యల విద్యార్థులను కిడ్నాప్‌ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

గురువారం ఉదయం కురిగా పాఠశాల ప్రాంగణంలోకి తుపాకులతో ప్రవేశించిన ముష్కరుల గుంపు గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన నుంచి పలువురు విద్యార్థులు, సిబ్బంది చాకచక్యంగా తప్పించుకోగా, ఒక టీచర్‌తో పాటు దాదాపు 187 మందిని ముష్కరులు కిడ్నాప్‌ చేశారు. మరో ప్రైమరీ పాఠశాల పైనా దాడిచేసి.. 125 మందిని కిడ్నాప్‌ చేశారు. అయితే వారిలో 25 మంది తప్పించుకున్నారు. ఇలా మొత్తంగా 280 మందికి పైగా చిన్నారులను ఎత్తుకెళ్లినట్లు అంచనా. దీనిని ధ్రువీకరించిన స్థానిక గవర్నర్‌.. విద్యార్థులంతా 8 నుంచి 15 ఏళ్ల వయసులోపు వారేనని వెల్లడించారు. వారిని కాపాడేందుకు సాయుధ బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్టు వెల్లడించారు.

నైజీరియాలో బందిపోట్లు ఇలా పాఠశాలలపై దాడులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. వాయవ్య, మధ్య ప్రాంతాల్లో అయితే ఈ ఘటనలు మరీ ఎక్కువ. పిల్లలను కిడ్నాప్‌ చేయడం.. భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేయడం వారికి అలవాటు. ఇటీవల ఇలాంటి దాడులు తగ్గాయని భావిస్తున్న తరుణంలోనే ఇంత పెద్ద సంఖ్యలో కిడ్నాప్‌ కి పాల్పడటం కలకలం రేపింది. అంతేకాదు.. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటుచేసుకున్న సంచార జాతులకు చెందిన కొందరు సాయుధులు స్థానిక గ్రామాలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పిల్లలను విడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News