గిఫ్ట్ తెచ్చిన తంటా.. దేశాధ్యక్షుడికి పదవీగండం!
దక్షిణ కొరియాను కుదిపేస్తున్న 'బ్యాగ్'
ఒక కానుక ఆ దేశాధ్యక్షుడి పదవికే ఎసరు తెచ్చింది. ఇప్పుడు ఆ దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది. ఇంతకీ ఏమిటా దేశం.. సమస్య తెచ్చిన కానుక ఏమిటా అని ఆలోచిస్తున్నారా.. చదవండి మరి! దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి కిమ్ కియోన్ హీకి రెండేళ్ల క్రితం ఒకరు అత్యంత ఖరీదైన డియోర్ బ్యాగ్ ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దాని విలువ 2,250 అమెరికన్ డాలర్లు ఉంటుందని చెప్తున్నారు. ఇంతకీ ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను తీవ్రంగా వ్యతిరేకించే పాస్టర్ చాయ్ జే యంగ్. ఆయన కిమ్ కియోన్ హీకి ఖరీదైన బ్యాగ్ 2022లో ఇవ్వగా, ఆ దృశ్యాలు 2023లో వెలుగు చూశాయి. ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది అనుకుంటున్నారా? గిఫ్ట్ ఇచ్చిన పాస్టర్ చాయ్ జే యంగ్ తన చేతి వాచీకున్న కెమెరాతో షూట్ చేశాడు. ''ఇంత ఖరీదైనది నేను ఎప్పుడూ కొనలేదు.. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు..'' అని మిసెస్ ప్రెసిడెంట్ అన్న వాయిస్ కూడా ఆ వీడియోతో పాటు రికార్డ్ అయ్యింది. ఇది కాస్త బయటకు వచ్చి వైరల్ కావడంతో దక్షిణ కొరియా ప్రెసిడెంట్, ఆయన భార్యపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఒక ఏడాదిలో 2,200 డాలర్ల విలువైన బహుతులు తీసుకోవడం చట్ట విరుద్ధం. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఫస్ట్ లేడీకి లంచం ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. దీనిపై దక్షిణా కొరియా ప్రెసిడెంట్ ఆఫీస్ స్పందిస్తూ.. ఫస్ట్ లేడీ గిఫ్ట్ తీసుకున్న మాట నిజమేనని నిర్దారించింది. తీసుకున్న గిఫ్ట్‌ను వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తూ భద్ర పరిచామని వెల్లడించింది. ఖరీదైన గిఫ్ట్ వ్యవహారంలో అక్కడి అధికారులు మిసెస్ ప్రెసిడెంట్ ను 12 గంటల పాటు విచారించి ఆమె లంచం తీసుకున్నట్టు సాక్ష్యాలు లేకపోవడంతో క్లీన్ చీట్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు మరింతగా పెంచాయి. రాజకీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక అధ్యక్షుడు ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత ఎక్కువగా రావడంతో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఎమర్జెన్సీ లాకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎమర్జెన్సీ మార్షల్ లా తెచ్చిన అధ్యక్షుడు గద్దె దిగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆయనపై అభిశంసన తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అధ్యక్షుడికి సొంత పార్టీ కూడా మద్దతు ఇవ్వడం లేదు.. దానికితోడు అధ్యక్షుడి రాజ్యాంగ హక్కుల్లో కోత విధించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో యూన్ ను పదవి నుంచి దించేయడం తప్పదని అంటున్నారు.