అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అస్వస్థత
క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆయన వ్యక్తిగత సిబ్బంది
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. క్రిస్మస్ నాటికి ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండుసార్లు (1993-2001) సేవలందించారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత 2021లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల నేపత్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుగా ప్రచారం కూడా చేశారు.