కాలిఫోర్నియాలో కార్చిచ్చు
పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీగా కార్చిచ్చు సంభవించింది. బలమైన గాలులు వీస్తుండటంతో అది వేగంగా వ్యాపిస్తున్నది. ఈ విపత్తు దృష్ట్యా లాస్‌ఏంజెలెస్ సమీపంలోని సుమారు 10 వేల మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మూడువేలకుపైగా నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో వారిని తరలించాల్సి వస్తున్నదని తెలిపారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడటంతో స్థానికులు అంధకారంలో మగ్గిపోతున్నారు. మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నది.
కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. దాంతో విజిబిలిటీ లేకపోవడంతో తరలింపు, మంటలను ఆర్పే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. కిలోమీటర్ విస్తీర్ణంలో మొదలైన మంటలు ఐదుగంటల వ్యవధిలోనే 62 కి.మీ. వ్యాపించాయి. కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తున్నదని, సమీప ప్రాంత ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని వెంచురా కౌంటీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దాదాపు 14,000 మందికి సమాచారం అందించారు. పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి.