వాషింగ్ట‌న్‌లో క‌ల‌క‌లం రేపిన విమానం.. - వెంటాడిన ఫైట‌ర్ జెట్‌

అనుమానాస్ప‌దంగా క‌నిపించిన బిజినెస్ విమానం.. కొంతసేపు వాషింగ్టన్‌లో ప్రయాణించి.. ఆ త‌ర్వాత వర్జీనియాలోని ఓ అటవీప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Update:2023-06-05 14:54 IST

అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో ఓ విమానం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అది అనుమానాస్ప‌దంగా సంచ‌రిస్తుండ‌టంతో ఎఫ్‌-16 ఫైట‌ర్ జెట్ యుద్ధ విమానం దానిని వెంబ‌డించింది. అమెరికా కాల‌మానం ప్ర‌కారం.. ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఈ ఘ‌ట‌న అక్క‌డి ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తించింది. చిన్న విమానాన్ని వెంబ‌డించిన‌ ఫైటర్ జెట్ అత్యంత వేగంగా జనావాసాల పైనుంచి ప్రయాణించడంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. దీంతో జ‌నం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

అస‌లేం జ‌రిగిందంటే..

టెన్నిసీ నగరంలోని ఎలిజబెతౌన్ నుంచి టేకాఫ్ అయిన ఓ బిజినెస్ జెట్‌.. లాంగ్ ఐలాండ్ (న్యూయార్క్) లోని మెక్ఆర్థర్ ఎయిర్‌పోర్టుకు వెళుతూ అనూహ్యంగా త‌న దిశ మార్చుకుంది. లాంగ్ ఐలాండ్ గగనతలంలో కొంతసేపు చక్కర్లు కొట్టిన ఆ విమానం ఆ తర్వాత ఉన్నట్టుండి వాషింగ్టన్ గగనతలంలోకి ప్రవేశించింది. భద్రతాపరంగా అత్యంత సున్నితమైన యూఎస్ క్యాపిటల్, వైట్ హౌస్ మీదుగా అది తిర‌గ‌డంతో వెంటనే అప్రమత్తమైన మిలిటరీ.. ఆ బిజినెస్ జెట్ పైలట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించింది. అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆ విమానాన్ని ఎఫ్-16 యుద్ధ విమానం వెంబడించింది.

భారీ శ‌బ్దాలు.. ఫైట‌ర్ జెట్ నుంచి మంట‌లు..

సాధారణంగా యుద్ధ విమానాలు జనసముదాయాల్లో నిర్ణీత వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫైటర్ జెట్లు సూపర్సానిక్ వేగంతో ప్రయాణించేందుకు కూడా అనుమతి ఉంటుంది. బిజినెస్ జెట్ అనుమానాస్పదంగా కన్పించడంతో ఎఫ్-16 అత్యంత వేగంతో గాల్లోకి ఎగరాల్సివచ్చింది. దీంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. వాషింగ్ట‌న్‌తో పాటు వర్జీనియా, మేరీల్యాండ్ వరకు ఈ శబ్దాలు రావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అంతేగాక, బిజినెస్ జెట్ పైలట్ దృష్టికి తీసుకెళ్లేందుకు యుద్ధ విమానం నుంచి మంటలను కూడా విడుదల చేశారు. ఇవి చూసిన ప్రజలు అప్రమత్తమై ఇళ్లల్లోకి వెళ్లిపోయారు.

విమానంలో రెండేళ్ల చిన్నారి స‌హా న‌లుగురు..

అనుమానాస్ప‌దంగా క‌నిపించిన బిజినెస్ విమానం.. కొంతసేపు వాషింగ్టన్‌లో ప్రయాణించి.. ఆ త‌ర్వాత వర్జీనియాలోని ఓ అటవీప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత ఎత్తులో ప్రయాణిస్తున్న ఆ విమానం అమాంతం కూలినట్టు తెలుస్తోంది. నిమిషానికి 30వేల అడుగుల కిందకు వచ్చి విమానం కూలిందని ఫ్లైట్ ట్రాకింగ్ సైట్లు వెల్లడించాయి. ఈ విమానం ఫ్లోరిడాలోని ఎన్కోర్ మోటార్స్ అనే కంపెనీ పేరిట రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ యజమాని జార్ రాంపెల్ స్పందిస్తూ.. ఆ విమానంలో తన కుమార్తె, 2 ఏళ్ల మనవరాలు, ఆయా, పైలట్ ఉన్నట్లు తెలిపారు. తనను చూడటానికి వచ్చి ఆ తర్వాత వారంతా ఆ విమానంలో ఇంటికి తిరుగుపయనమైనట్లు చెప్పారు. అయితే, ఘటనాస్థలంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో కన్పించలేదని వర్జీనియా పోలీసులు వెల్లడించారు.

బైడెన్ గోల్ఫ్ ఆడుతుండ‌గా ఘ‌ట‌న‌..

యుద్ధ విమానం బిజినెస్ జెట్‌ను వెంబడించిన సమయంలో అధ్యక్షుడు బైడెన్.. జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద గోల్ఫ్ ఆడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా ఆయన షెడ్యూల్ ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొన్నారు. ఘటన గురించి బైడెన్‌కు వివరించినట్లు అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News