సునక్ విజయంపై యుకెలో ప్రవాసభారతీయుల హర్షాతిరేకాలు..
బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలుగల రిషీ సునాక్ ఎన్నిక కావడం పట్ల అక్కడి భారతీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కాకుండా, అందులోనూ హిందువు ప్రధాని అవడం చూసి ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నారని పలువురు హిందువులు అన్నారు.
దీపావళి రోజున రిషి సునాక్ సాధించిన విజయంతో యుకె అంతటా ఉన్న ప్రవాస భారతీయ సమూహాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. వారంతా దీనిని బ్రిటిష్ సామాజిక చరిత్రలో ఒక "చారిత్రక క్షణం"గా అభివర్ణించారు.
వినాశకరమైన పన్ను తగ్గింపు మినీ-బడ్జెట్ తో పాటు అనేక పాలసీ యు-టర్న్‌ల నేపథ్యంలో గత గురువారం లిజ్ ట్రస్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి నాటకీయమైన పరిణామాల నడుమ టోరీ నాయకత్వ రేసులో సునక్ విజయం సాధించారు.
రిషి సునక్ యుకె ప్రధానమంత్రి కావడం " బరాక్ ఒబామా మూమెంట్ " లాంటిదని, అమెరికాలో ఒబామా రోజులు గుర్తొస్తున్నాయని భారతీయ సంతతికి చెందిన రిషి తాత స్థాపించిన హిందూ దేవాలయం ధర్మకర్త అన్నారు.
లండన్‌కు దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌతాంప్టన్‌లోని వైదిక్ సొసైటీ హిందూ దేవాలయాన్ని సునక్ తాత రాందాస్ సునక్ 1971లో స్థాపించారు. అతని తండ్రి యష్ 1980లలో ట్రస్టీగా తన అనుబంధాన్ని కొనసాగించారని ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక నివేదించింది. సునాక్ కూడా ఆ దేవాలయానికి వచ్చివెలుతుండేవాడు. గత యేడాది కూడా ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడని ఆ పత్రిక పేర్కొంది. రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికవడంతో అక్కడి వారంతా ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు ప్రదర్శిస్తున్నారని తెలిపింది.
" ఇక్కడ శ్వేతజాతీయేతర వ్యక్తి మొదటిసారి ప్రధాని అవుతున్నాడు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, అంతేకాకుండా హిందువు అవడం కూడా మరొక కోణం. ఈ క్షణాలను చూసి ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నారని రిషి ఎన్నికలను సెలబ్రేట్ చేసిన సంజయ్ చందరాణా చెప్పారు. 2009లో అమెరికా అధ్యక్షుడుగా తొలి ఆఫ్రికన్ అమెరికన్ ఒబామా ఎలాగైతే విజయం సాధించారో సునక్ విజయాన్ని కూడా అలాగే చూస్తున్నాం. అన్నారు. ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సునక్ విషయంలో అంతా ఒక్కటయ్యారని, మరింత కలిసిపోతారని చెప్పగలను అని సంజయ్ చందరాణా అన్నారు. అతనికి అతిపెద్ద సవాలు ఆర్థిక రంగాన్ని చక్కరదిద్దడం. రాజకీయ అనిశ్చితిని అతను పరిష్కరించవలసి ఉంటుంది అన్నారు.
ఒక భారతీయ రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.., అతను దేశాన్ని ఉద్వేగభరితంగా' నడిపిస్తాడని నమ్ముతున్నానన్నాడు. సునాక్‌కి చిన్నతనం నుంచి తెలిసిన కుటి మియా, ఇలా అన్నాడు: నేను అతనికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను, అతను గొప్ప వ్యక్తి .అతను దేశాన్ని మరింత మెరుగ్గా నడిపిస్తాడని నేను ఆశిస్తున్నాను.అన్నాడు ఇది చాలా కష్టమైన సమయం, అతను ఎదురుగా ఒక కఠినమైన పని ఉంది. కానీ అతను అందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను ఆ పనిని సమర్ధంగా చేయగలిగిన వ్యక్తి అని అన్నాడు.
అతని గురించి నాకు బాగా తెలుసు. అతను తన వంతు కృషి చేస్తాడని నాకు తెలుసు. అతను ప్రజలతో నిజాయితీగా ఉంటాడు. అతను మానవ సంబంధాల ప్రేమికుడు. అతను డబ్బు కోసం ఉద్యోగం చేయడం లేదు, అతనికే చాలినంత డబ్బు ఉంది అన్నాడు.