ఆఫీస్ లో ఉన్నా, దారిలో ఉన్నా ఇంటికి వెళ్ళిపోండి... ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ ఆదేశాలు

ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపును ప్రారంభించారు. ఒకే సారి 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం.

Advertisement
Update:2022-11-04 13:11 IST

ట్విట్టర్ సంస్థను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఉద్యోగుల తొలగింపు కార్యక్రమ‍ం పెద్ద ఎత్తున ప్రారంభించారు. మస్క్ రాగానే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్,పాలసీ ఛీఫ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెడ్ సెగల్ లను తొలగించగా ట్విట్టర్‌ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగం అధిపతి సారా పెర్సోనెట్‌, చీఫ్‌ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ దలానా బ్రాండ్, కోర్ టెక్నాలజీస్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్‌వెల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విటర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్, గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ మహ్యూ కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలో మరో 3700 మంది ఉద్యోగులను ఎలన్ మస్క్ తొలగించనున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులందరికీ గురువారం ఈ మెయిల్స్ అందాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతు౦దని చెప్పిన ట్విట్టర్ యాజమాన్యం. ''ఒక వేళ ఆఫీస్ కు వస్తే వెంటనే వెళ్ళిపోండి. ఆఫీసుకు వస్తూన్న తోవలో ఉంటే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళండి. ఇంట్లోనే ఉంటే ఆఫీస్ కు రాకండి'' అని ట్విట్టర్ ఉద్యోగులందరికీ మెయిల్స్ చేసింది యాజమాన్యం.

"ట్విట్టర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం నాడు మా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే కష్టమైన ప్రక్రియను మేము ప్రారంభిస్తున్నాము. ట్విట్టర్‌కు విలువైన సహకారాన్ని అందించిన అనేక మంది వ్యక్తులపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని మాకు తెలుసు. అయితే కంపెనీ లాభాలబాటలో ముందుకు సాగడానికి దురదృష్టవశాత్తు ఈ చర్య అవసరం, "అని ఇమెయిల్ పేర్కొంది.

ట్విట్టర్ తన చివరి త్రైమాసికం నివేదికలో 270 మిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నివేదించింది.అంతే కాక ట్విట్టర్ ను చాలా ఎక్కువ ధర పెట్టి కొన్నానని ఎలన్ మస్క్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ను లాభాల బాట పట్టించేందుకు సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్ల మేర ఖర్చు తగ్గించుకోవాలని మస్క్ ట్విట్టర్ అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రారంభించింది ట్విట్టర్.

Tags:    
Advertisement

Similar News