ఎల‌న్ మస్క్ శ్రమ దోపిడి.... ట్విట్టర్ ఉద్యోగులకు రోజుకు 12 గంటలు, 7 రోజులు పని

ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్ర‌పంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2022-11-02 12:41 IST

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థని కొన్నప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తొలి రోజే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగల్‌, పాలసీ చీఫ్‌ విజయా గద్దెలను తొలగించారాయన. ఆ తర్వాత బ్లూ టిక్ బ్యాడ్జ్ ఉన్న వినియోగదారుల నుండి నెలకు మన కరెన్సీలో దాదాపు 1,600 రూపాయలను వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని 660 రూపాయలకు తగ్గిస్తానని మస్క్ చెప్పారు.

ఇప్పుడిక ఆయన తీసుకున్న మరో నిర్ణయంతో ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. CNBC ఛానల్ నివేదిక ప్రకారం... కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లు రోజుకు 12 గంటలు, వారానికి ఏడు రోజులు పని చేయాలని ఎలన్ మస్క్ ఆదేశించారు. లేదంటే ఉద్యోగాలను కోల్పోతారని ఆయన హెచ్చరించారు.

ఇలా పని చేసినందుకు ఆ ఉద్యోగులకు ఓవర్ టైం పేమెంట్ కూడా ఇవ్వరు. ఓవర్ టైం పేమెంట్ గురించికానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ ఎటువంటి చర్చ లేకుండానే ఉద్యోగులను అదనపు గంటలు పని చేయమని కోరినట్లు CNBC వెల్లడించింది. తాము విధించిన గడువు నవంబర్ 7 లోగా ఉద్యోగులు తమ టాస్క్ పూర్తి చేయకపోతే 50 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ఎలన్ మస్క్ తేల్చి చెప్పేశారు.

మరోవైపు ఎలాన్‌ మస్క్‌ వచ్చిన తర్వాత ఆయన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగించగా మరికొంతమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. తాజాగా ట్విట్టర్‌ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగం అధిపతి సారా పెర్సోనెట్‌, చీఫ్‌ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ దలానా బ్రాండ్, కోర్ టెక్నాలజీస్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్‌వెల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విటర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్, గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ మహ్యూ కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News