ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.. - మస్క్ కీలక నిర్ణయం
ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా.. వద్దా.. అంటూ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌కి 51.8 శాతం మంది అనుకూలంగా, వద్దంటూ 48.2 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తూ ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించారు. ఆయన ట్విట్టర్ ఖాతా ఇప్పుడు మళ్లీ మనుగడలోకి వచ్చింది. ఈ విషయంపై ట్రంప్ మాత్రం ఇంకా స్పందించలేదు. పాత మెసేజ్‌లతో కూడిన ఆయన ట్విట్టర్ ఖాతా ఇప్పుడు సోషల్ మీడియా వేదికపై దర్శనమిస్తోంది.
ఒపీనియన్ పోల్ నిర్వహించడం ద్వారా మస్క్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా.. వద్దా.. అంటూ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌కి 51.8 శాతం మంది అనుకూలంగా, వద్దంటూ 48.2 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక మంది అభిప్రాయాన్ని గౌరవిస్తూ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
2020 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతు దారులు 2021 జనవరిలో క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్ ఖాతాను రద్దు చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది.
ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించడంపై శనివారం నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ స్పందించారు. పోల్‌ను స్వాగతించి, మస్క్ అంటే తనకు ఇష్టమని, కానీ ట్విట్టర్‌కు తిరిగి రావడానికి తనకు ఎలాంటి కారణమూ కనిపించడం లేదని విముఖత వ్యక్తం చేశారు. తనకు సొంత సోషల్ మీడియా.. `ట్రూత్ సోషల్` ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.