అక్కడ చాట్ జీపీటీపై నిషేధం..
హోమ్ వర్క్ పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం, అసైన్ మెంట్లు.. ఇలాంటి వాటికి విద్యార్థులు చాట్ జీపీటీ వాడకూడదని పలు విద్యాసంస్థలు ఇప్పటికే నిబంధనలు పెట్టాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇప్పటి వరకూ కచ్చితంగా తెలియలేదు. లీవ్ లెటర్లు రాయించుకోవడం, వాలంటైన్స్ డే కి లవ్ లెటర్లు రాయించుకోవడం.. ఇలాంటి పనులకు చాలామంది చాట్ జీపీటీని వాడుకున్నారనే ఉదాహరణలు మాత్రం ఉన్నాయి.
అయితే దీని వాడకంపై విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చాట్ జీపీటీపై ఆధారపడితే ఇక వారి సాధారణ తెలివితేటలు మరుగున పడిపోతాయని అంటున్నారు నిపుణులు. అందుకే విద్యార్థులు చాట్ జీపీటీ సాయం తీసుకోకూడదనే నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.
హోమ్ వర్క్ పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం, అసైన్ మెంట్లు.. ఇలాంటి వాటికి విద్యార్థులు చాట్ జీపీటీ వాడకూడదని పలు విద్యాసంస్థలు ఇప్పటికే నిబంధనలు పెట్టాయి. విద్యార్థులు చాట్ జీపీటీకి అలవాటు పడితే వారి అభ్యసన సామర్థ్యం దెబ్బతినే అవకాశముందని అంటున్నారు. బెంగళూరులోని RV యూనివర్శిటీ చాట్ జీపీటీని నిషేధించింది. న్యూయార్క్ ఎడ్యుకేషన్ బోర్డ్ కూడా చాట్ జీపీటీ వాడకంపై ఆంక్షలు విధించింది.
తాజాగా యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ కూడా తమ విద్యార్థులు చాట్ జీపీటీని వాడొద్దని చెప్పింది. చాట్ జీపీటీతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని కూడా వాడకూడదని హెచ్చరించింది. ప్రొఫెసర్లు కూడా బోధనలో ఇలాంటి వాటిని ఉపయోగించొద్దని ఆదేశించింది.
ప్రొఫెసర్ల అనుమతి లేకుండా చాట్ జీపీటీ ఉపయోగించి అసైన్ మెంట్ పూర్తి చేసిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హాంగ్ కాంగ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్లు హెచ్చరించారు. అసైన్ మెంట్లు పూర్తి చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారనే అనుమానం వస్తే, అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వారి సామర్థ్యాలను నేరుగా పరీక్షిస్తామని స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్ లో ఏఐకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి దానిపై మరింత చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.