ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాల పునరుద్ధరణ

ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉందని భావించిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ట్రంప్ కు ఉన్న సోషల్ మీడియా ఖాతాలను తొలగించాయి.

Advertisement
Update:2023-01-26 15:09 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాలపై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు ఎత్తివేశాయి. రెండేళ్ల కిందట అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో ట్రంప్ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలపై వాటి మాతృ సంస్థలు నిషేధం విధించాయి. ఇటీవల ట్విట్టర్ ట్రంప్ ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో తాజాగా ఫేస్ బుక్, ఇన్ స్టా కూడా ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించాయి.

2021లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించగా, ట్రంప్ ఓటమిపాలయ్యాడు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంలోకి చొరబడి ధ్వంసం చేశారు. నానా బీభత్సం సృష్టించారు. అయితే ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే వారు ఈ విధంగా వ్యవహరించారని ప్రచారం జరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉందని భావించిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ట్రంప్ కు ఉన్న సోషల్ మీడియా ఖాతాలను తొలగించాయి. ఆ తర్వాత ట్రంప్ ట్విట్టర్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సొంతంగా ట్రంప్ ట్విట్టర్ వంటి యాప్ ని రూపొందించి దానినే వాడుతూ వచ్చారు.

ఇదిలా ఉండగా కొద్ది నెలల కిందట ట్విట్టర్ ని ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ ట్రంప్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే గత నవంబర్లో ట్రంప్ ఖాతా పై ఉన్న నిషేధాన్ని ట్విట్టర్ తొలగించింది. ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టా మాతృ సంస్థ అయిన మెటా ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో అది వినవచ్చని మెటా పేర్కొంది. అది మంచైనా, చెడైనా కావచ్చని తెలిపింది. ప్రజలు బ్యాలెట్ బాక్స్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News