CNN పై 47 కోట్ల 50 లక్షల డాలర్లకు పరువు నష్టం దావా వేసిన ట్రంప్

CNN ఛానల్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగిస్తూ వార్తలను ప్రసారం చేస్తున్నందుకుగాను తనకు 475 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

Advertisement
Update:2022-10-04 11:17 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం CNN ఛానల్ పై పరువు నష్టం దావా వేశారు.CNN తనకు పరువు నష్టం కలిగించిందని అందువల్ల 475 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

ట్రంప్, ఫ్లోరిడాలోని US డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో దాఖలు చేసిన దావాలో, తాను 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాననే భయంతో CNN తనపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించాడు.

CNN ప్రజల్లో తనకున్న‌ ప్రభావాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు... వీక్షకుల‌ మదిలో తనపై చెడు అభిప్రాయాలు నెలకొనేలా కథనాలను ప్రచురిస్తోందని అన్నారు. తనను రాజకీయంగా ఓడించే ఉద్దేశ్యంతోనే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తోందని ట్రంప్ లాయర్లు తమ 29 పేజీల పిటిషన్ లో పేర్కొన్నారు.

త‌నను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా CNN, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రధాన వార్తా సంస్థలపై ఆరోపణలు గుప్పించేవాడు. అవి ప్రసారం చేసేవి, ప్రచురించేవి ఫేక్ వార్తలంటూ విరుచుకపడేవాడు.   

Tags:    
Advertisement

Similar News