ఆ భారతీయ మందులను వాడకండి - WHO సిఫారసు

ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది మరణాలకు కారణమైన , భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించకూడదని WHO ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Update:2023-01-12 08:50 IST

నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసింది.

ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది మరణాలకు కారణమైన , భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించకూడదని WHO ఒక ప్రకటనలో తెలిపింది.

"రెండు ఉత్పత్తులు AMBRONOL సిరప్, DOK-1 మాక్స్ సిరప్ ల‌ను లాబొరేటరీ విశ్లేషణ జరపగా రెండు ఉత్పత్తులలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ ఆమోదయోగ్యం కాని మొత్తంలో ఉన్నట్లు కనుగొన్నారు," అని WHO తెలిపింది.

డిసెంబరులో, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన మందులను వాడటం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

"ఈ రెండు ఉత్పత్తులకు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలలో కూడా మార్కెటింగ్ అధికారాలు ఉండవచ్చు. అవి అనధికారిక మార్కెట్ల ద్వారా కూడా ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు కూడా పంపిణీ చేసి ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి" అని WHO హెచ్చరిక చేసింది.

''ఈ నాసిరకం ఉత్పత్తులు సురక్షితం కాదు. వాటిని ఉపయోగించడం వల్ల‌ ముఖ్యంగా పిల్లలలో, తీవ్రమైన అనారోగ్య‍ లేదా మరణానికి దారితీయవచ్చు'' అని WHO పేర్కొంది.

ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది.

"సరిఅయిన‌ పత్రాలు అందించనందున మేము మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను సస్పెండ్ చేసాము, తనిఖీ సమయంలో అడిగిన పత్రాలను వారు అందించకపోవడంతో రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ షో-కాజ్ నోటీసు కూడా ఇచ్చింది" అని గౌతమ్ బుద్ధ్ నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వైభవ్ బబ్బర్ తెలిపారు

కాగా మరో భారతీయ కంపెనీ మైడెన్ ఫార్మా తయారు చేసిన నాలుగు దగ్గు మందుల వల్ల గాంబియాలో తీవ్రమైన కిడ్నీ సమస్యలతో 66 మంది చిన్నారులు మరణించారు. ఈ కంపెనీ మందులపై కూడా WHO నాలుగు నెలల క్రితం హెచ్చరిక‌ జారీ చేసింది. 

Tags:    
Advertisement

Similar News