ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో వివ‌క్ష ఆరోప‌ణ‌ల కేసు

ఇన్ఫోసిస్ లో వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా వివక్ష ఉందని అమెరికా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ త‌న‌ను కోరినట్లు ఇన్ఫోసిస్‌ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ ఆరోపించారు.

Advertisement
Update:2022-10-09 18:42 IST

బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికా కోర్టులో వివ‌క్ష ఆరోప‌ణ‌ల‌పై కేసును ఎదుర్కొటోంది. వయస్సు, లింగం, జాతీయత ఆధారంగా నియామక ప్రక్రియలో కంపెనీ వివక్ష చూపుతోందని గత సంవత్సరం సంస్థ‌ మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు చేయ‌డంతో ఈ కేసు న‌మోదైంది.

భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ త‌న‌ను కోరినట్లు ఇన్ఫోసిస్‌ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ పేర్కొన్నారు.

న్యూయార్క్‌లోని దక్షిణ జిల్లాకు సంబంధించిన యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు ఆమె షాకింగ్ వాంగ్మూలం ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ, కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, భాగస్వాములపై ​​ ప్రీజీన్ కోర్టులో దావా వేశారు.

"వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌లలో ఉన్న ఈ చట్టవిరుద్ధమైన వివక్షతో కూడిన ఈ సంస్కృతిని చూసి తాను షాక్ అయ్యాను" అని ప్రీజీన్ చెప్పింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె 2018లో "తన ఉద్యోగంలో చేరిన మొదటి రెండు నెలల్లోనే ఈ సంస్కృతిని మార్చడానికి ప్రయత్నించినా కానీ ఇన్ఫోసిస్ భాగస్వాములు - జెర్రీ కర్ట్జ్ , డాన్ ఆల్బ్రైట్ నుండి ప్రతిఘటన" ఎదుర్కొన్నాన‌ని పేర్కొంది.

సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించడంలో కంపెనీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌నందున ఆమెను తొల‌గించామ‌ని, అందువ‌ల్ల ఆమె ఫిర్యాదును దావాను కొట్టివేయాలని ఐటి దిగ్గజం పిటిష‌న్ దాఖలు చేసింది. ప్రీజీన్ త‌న ఆరోపణలకు రుజువులను సమర్పించనందున కేసు కొట్టేయాల‌ని ఇన్ఫోసిస్ కోరింది.

అయితే ఇన్ఫోసిస్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆర్డర్ తేదీ (సెప్టెంబర్ 30) నుండి 21 రోజుల్లోగా ప్రతిస్పందనను సమర్పించాలని కంపెనీని కోర్టు కోరింది. మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , కన్సల్టింగ్ అధిపతి మార్క్ లివింగ్‌స్టన్, మాజీ భాగస్వాములు డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్‌లపై ఆమె దావా వేసింది.

Tags:    
Advertisement

Similar News