బ్రెజిల్ లో విధ్వంసం: పార్లమెంటు, సుప్రీం కోర్టు, అధ్యక్షభవనాలపై ఆందోళనకారుల‌ దాడి

ఆకుపచ్చ జెండాలు, పసుపు రంగు దుస్తులు ధరించిన నిరసనకారులుల పార్లమెంటును ఆక్రమించారు. సుప్రీం కోర్ట్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్ళి లోపల విధ్వంస సృష్టించారు. నిరసన కారులు అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మీ జోక్యం చేసుకోవాలని కోరుతూ బ్యానర్లు ప్రదర్శించారు.

Advertisement
Update:2023-01-09 11:48 IST

బ్రెజిల్ అల్లకల్లోలమయ్యింది. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు వేలాది మంది రోడ్లెక్కి విధ్వంసం సృష్టించారు. పోలీసు బారికేడ్‌లను ఛేదించి కాంగ్రెస్(పార్లమెంటు), అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టులపై ఆదివారం దాడి చేశారు,

ఆకుపచ్చ జెండాలు, పసుపు రంగు దుస్తులు ధరించిన నిరసనకారులుల పార్లమెంటును ఆక్రమించారు. సుప్రీం కోర్ట్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్ళి లోపల విధ్వంస సృష్టించారు. నిరసన కారులు అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మీ జోక్యం చేసుకోవాలని కోరుతూ బ్యానర్లు ప్రదర్శించారు.

ఈ దృశ్యాలు జనవరి 6, 2021న బోల్సోనారో మిత్రుడైన అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు US కాపిటల్ భవనంపై దాడిని గుర్తుచేశాయి అని బ్రెజిల్ అధ్యక్షుడి మద్దతుదారులు విమర్శించారు. ఇది ఫాసిస్టు దాడిగా అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అభివర్ణించారు.

ఈ దాడులను, దోపిడీలను తాను ఖండిస్తున్నట్టు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ప్రకటించారు. ఈ దాడులకు తాను కారణమంటూ అధ్యక్షుడు లూయిజ్ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు.

"ఈ ఫాసిస్ట్ మతోన్మాదులు ఈ దేశ చరిత్రలో మునుపెన్నడూ చూడని పనిని చేసారు" అని అక్టోబర్ ఎన్నికలలో బోల్సోనారోను ఓడించి వారం క్రితం అధ్యక్ష‌ బాధ్యతలు స్వీకరించిన వామపక్షవాది లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అన్నారు.

"ఈ విధ్వంసకులు ఎవరో మేము కనుగొంటాము. వారిని చట్టం ప్రకారం శిక్షిస్తాము" అని ఆయన చెప్పారు.

అక్టోబర్ 30న ఎన్నికల్లో బోల్సోనారోను ఓడించినప్పటి నుండి లూలా అధికారాన్ని చేపట్టకుండా ఆపడానికి బోల్సోనారో మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సైనిక జోక్యానికి పిలుపునిస్తూ బ్రెజిల్‌లోని ఆర్మీ బేస్‌ల వెలుపల బోల్సోనారో మద్దతుదారులు నిరసనలు చేస్తున్నారు.

అల్లరి మూకలు కాంగ్రెస్ భవనంలోకి ప్రవేశించడానికి తలుపులు, కిటికీలను పగలగొట్టి, ఆపై మూకుమ్మడిగా లోపలికి ప్రవహించడం, శాసనసభ్యుల కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించడం, శాసనసభ్యులను అవమానించడం...తదితర దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఒక వీడియోలో బయట ఉన్న గుంపు గుర్రంపై నుండి ఒక పోలీసును లాగి నేలకు కొట్టడం కనిపించింది.

కాగా పోలీసులు, అల్ల‌రి మూకలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. దాంతో గుర్రాలపై వచ్చిన భద్రతా దళాలు లాఠీ చార్జ్ చేశాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి హెలికాప్టర్ల నుండి బాష్పవాయువు బాంబులను ప్రయోగించారు. అయినప్పటికీ గందరగోళం సాయంత్రం వరకు కొనసాగింది. భారీగా అల్లరి మూకలు ఇప్పటికీ మూడు భవనాల వద్ద గుమిగూడే ఉన్నాయి.

ఒక ఫోటోగ్రాఫర్‌తో సహా కనీసం ఐదుగురు రిపోర్టర్‌లపై దాడి జరిగిందని జర్నలిస్టుల సంఘం తెలిపింది. ఫోటో గ్రాఫర్ ను నిరసనకారులు కొట్టారు. అతని సామగ్రిని అపహరించారు.

తాజా దాడి ఘటనలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్, మెక్సికన్ విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ లు ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా వారు అభివర్ణించారు.

Tags:    
Advertisement

Similar News