అణుదాడి జరిగితే అయోడిన్‌ మాత్రలే దిక్కు..

అణు ప్రమాదాలు జరిగిన తర్వాత అయోడిన్‌ మాత్రలు ఉపయోగిస్తే, వాతావరణం నుంచి మన శరీరంలో కలిసే రేడియోధార్మిక అయోడిన్‌ తో పెద్దగా ముప్పు ఉండదనమాట. దీనికోసమే ఇప్పుడు అయోడిన్‌ మాత్రలు నిల్వ చేసుకుంటున్నారు.

Advertisement
Update:2022-10-14 06:15 IST

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో అణుదాడులు జరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఐరోపా దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అణు యుద్ధం జరిగితే ఆ విపరీతాల నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాయి. ప్రత్యామ్నాయాలపై ప్రజలు దృష్టిపెడుతున్నారు. ఎవరు చెప్పారో, ఎలా ప్రచారం జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు ఐరోపా దేశాల్లో అయోడిన్‌ మాత్రలకు గిరాకీ పెరిగింది. అణు యుద్ధ భయాల నేపథ్యంలో ప్రజలంతా అయోడిన్‌ మాత్రలు కొని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో అటు షాపుల్లో కూడా వీటికి కొరత వచ్చింది. ఇతర దేశాలనుంచి కూడా ఐరోపా దేశాలు అధిక ధరకు అయోడిన్‌ మాత్రలు దిగుమతి చేసుకుంటున్నాయి.

అణు యుద్ధం జరిగితే..

అణుబాంబుల విధ్వంసం తర్వాత ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈపాటికే ప్రపంచ దేశాలకు ఓ అవగాహన ఉంది. హిరోషిమా, నాగసాకి అనుభవాల తర్వాత వైద్య నిపుణులు కూడా ఆ దుష్ప్రభావాలపై అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాల హెచ్చరికలే ఇప్పుడు అయోడిన్‌ మాత్రల కొనుగోలుకి కారణం. అణు విధ్వంసం జరిగితే మానవుల శరీరానికి కలిగే రేడియేషన్ ముప్పునుంచి అయోడిన్‌ మాత్రలు రక్షణ కల్పించగలవు.

అణు బాంబుల ప్రయోగం తర్వాత అందులోనుంచి రేడియో ధార్మిక అయోడిన్‌ వాతావరణంలో విడుదల అవుతుంది. ఇది మనిషి శరీరంలో చేరితే థైరాయిడ్, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ. దీన్ని నివారించాలంటే అయోడిన్‌ ని స్థిరంగా ఉంచాలి, శరీరంలో అయోడిన్ స్థాయి స్థిరంగా ఉంచడానికి చాలామంది అయోడిన్‌ మాత్రలు వాడుతుంటారు. అంటే అణు ప్రమాదాలు జరిగిన తర్వాత అయోడిన్‌ మాత్రలు ఉపయోగిస్తే, వాతావరణం నుంచి మన శరీరంలో కలిసే రేడియోధార్మిక అయోడిన్‌ తో పెద్దగా ముప్పు ఉండదనమాట. దీనికోసమే ఇప్పుడు అయోడిన్‌ మాత్రలు నిల్వ చేసుకుంటున్నారు.

అయోడిన్‌ మాత్రల్లో ఉండే పొటాషియం అయోడైడ్‌ అనే రసాయనిక సమ్మేళనం మానవ శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో స్థిరమైన అయోడిన్‌ ని ఉంచుతుంది. అంటే అణు దాడి కారణంగా రేడియోధార్మిక అయోడిన్‌ విడుదలైనా.. అది థైరాయిడ్ గ్రంథిలోకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. అందుకే ఈ ముందు జాగ్రత్తలన్నీ. దీనివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే అయినా ముందు జాగ్రత్తగా ప్రజలు అయోడిన్‌ మాత్రలు నిల్వ చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News