హవాయి కార్చిచ్చులో 99కి చేరిన మృతులు

ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.

Advertisement
Update:2023-08-15 21:10 IST

అమెరికాకు హవాయిలోని మావీయ్ ద్వీపంలో మొదలైన కార్చిచ్చు కలిగించిన విధ్వంసం కనీవిని ఎరుగని రీతిలో ఉంది. మంటల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య‌ 99కి చేరింది. శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. లోహాలు సైతం కరిగిపోయిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కొందరి మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మృతదేహాల వెలికితీత ప్రక్రియ ఇప్పటివరకు 25% మాత్రమే పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారి శరీర భాగాలను గుర్తించేందుకు DNA పరీక్షలకు పంపారు.


ముక్కలు ముక్కలుగా దొరుకుతున్న శరీర భాగాలని గుర్తించడం కూడా రాను రాను కష్టంగా మారుతోంది. లభించిన 99 మృతదేహాలలో మూడింటిని మాత్రమే వేలిముద్రల ఆధారంగా గుర్తించగలిగారు. రానున్న పది రోజుల్లో మృతుల సంఖ్య రెట్టింపుపై అవకాశం ఉందని తెలిపారు. మానవ అవ‌శేషాలను గుర్తించేందుకు కాలిపోయిన వందలాది ఇల్లు, వేలాది వాహనాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు. కార్చిచ్చు ధాటికి 2,200 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. అందులో 86 శాతం మేర నివాసాలే ఉన్నాయి. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.




కార్చిచ్చు ప్రారంభానికి ముందు ఈ ప్రాంతాన్ని ఒక హరికేన్ చుట్టుముట్టింది. హరికేన్ ప్రభావాన్ని విమానాల ద్వారా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది, కార్చిచ్చుని చూసి అప్రమత్తం అయ్యేలోపే గాలుల కారణంగా మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో నిత్యం పర్యాటకులతో పచ్చగా కనిపించే ప్రాంతాలన్నీ ఇప్పుడు భస్మమయిపోయాయి. సిబ్బంది కొరత, పరికరాల కొరత సహాయ చర్యలకు ఆటంకంగా మారగా, ఈ ప్రాంతాన్ని చూడటానికి అంచనా వెయ్యడానికి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ప్రయత్నించకపోవడం, ఈ విషయంపై స్పందన కోరిన విలేఖరులతో నో కామెంట్స్ అన్న వ్యాఖ్య చెయ్యడం విమర్శలకు తావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News