నగదు మాయం చేసి.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. - ఇదో రకం నయా మోసం
బ్యాంకు సొమ్ము చోరీ చేయకముందే ఆమెకు వివాహం అయింది. అయినా చోరీ అనంతరం తన గుట్టు బయటపడకుండా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది.
ఆమె ఓ బ్యాంకు క్లర్కు. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాన్ని గమనించి డబ్బు కొట్టేసింది. తాను పట్టుబడకూడదని ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. పాతికేళ్లపాటు కొత్త జీవితాన్ని గడిపింది. ఆమె కోసం గాలింపు కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు పట్టేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ వ్యవహారం చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
ఆమె పేరు చెన్ వైల్.. 1997లో యెకింగ్‌లో గల చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్కుగా పనిచేసేది. విధి నిర్వహణలో ఉండగా ఒకరోజు బ్యాంకింగ్ వ్యవస్థలోని ఒక లోపాన్ని గుర్తించింది. బ్యాంకులోని నగదును సులభంగా తన ఖాతాలోకి మళ్లించేందుకు అవకాశముందని అర్థమైంది. ఆమెకు వెంటనే ఆశ పుట్టింది. తాను పట్టుబడకుండా ఉండటం కోసం ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా బ్యాంకు నుంచి రూ.6.8 కోట్ల నగదును తన ఖాతాలోకి మళ్లించుకుంది.
మళ్లించిన సొమ్మలో రూ.4.7 కోట్లు డ్రా చేసుకుని.. ఆస్పత్రికి వెళ్లి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని రూపురేఖలు మార్చుకుంది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లి.. వారి కోసం కొంత డబ్బు ఖాతాలో వేసి.. వారు డ్రా చేసుకునేందుకు వీలుగా.. అందుకు సంబంధించిన ఖాతా పుస్తకాలను వారి వద్ద ఉంచింది. కుటుంబసభ్యులకు ఈ విషయం తెలియజేయగా, వారు ఈ పని సరికాదని వారించారు. వారు కొంత సొమ్మును బ్యాంకుకు తిరిగిచ్చేశారు. ఆమె మాత్రం వారి మాట వినకుండా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ తన పేరు మార్చుకొని మరో పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తెకూ జన్మనిచ్చింది. వ్యాపారవేత్తగానూ ఎదిగింది.
బ్యాంకు సొమ్ము చోరీ చేయకముందే ఆమెకు వివాహం అయింది. అయినా చోరీ అనంతరం తన గుట్టు బయటపడకుండా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. ఆమెను గుర్తించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పోలీసులు తాజాగా ఆమె గుట్టు పట్టేశారు. 1997 నుంచి దాదాపు పాతికేళ్లపాటు పోలీసులు చేపట్టిన గాలింపు ఫలించింది. చివరికి ఆమె పోలీసులకు చిక్కింది.