చైనాలో జల ప్రళయం

వరదల్లో ఇంకా అనేక మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు బోట్లు, హైలికాప్ట‌ర్ల సాయంతో ఇళ్లపైన ఉన్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి.

Advertisement
Update:2023-08-03 15:07 IST

డోక్సూరి తుపాను (Typhoon Doksuri) దెబ్బకి చైనా (China) అల్లాడిపోతోంది. శనివారం నుంచి కురిసిన కుండపోత వర్షాలు తెరిపిచ్చినా, పోటెత్తిన వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి.

ముఖ్యంగా రాజధాని బీజింగ్ (Beijing) వరదలకు అతలాకుతలమైంది. మొత్తంగా 140ఏళ్ల రికార్డును తిరగరాసిన వర్షం ధాటికి చైనా రాజధాని పరిసర ప్రాంతాల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది జాడ తెలియరాలేదు. ఎడతెరిపి లేని భారీ వర్షం కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్లు, ఇతర వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 8 లక్షల మందికిపైగా ప్రజలు ఈ వరదలకు ప్రభావితులయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరదల్లో ఇంకా అనేక మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు బోట్లు, హైలికాప్ట‌ర్ల సాయంతో ఇళ్లపైన ఉన్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వర్షం ఆగినప్పటికీ చుచౌ అనే గ్రామం పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ఒక్క ఆ గ్రామంలోనే 28 అత్యవసర సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. చైనా వ్యాప్తంగా వరద సహాయ చర్యల కోసం మొత్తం 9వేల మంది సిబ్బందిని ప్రభుత్వం పంపింది. అయితే కొన్నిచోట్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే విధి నిర్వహణలో ఉన్న 11మంది అధికారులు మృత్యువాత పడ్డారు. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది.

140 ఏళ్లలో ఎరుగనంత తీవ్రస్థాయిలో ఈ జల ప్రళయం సంభవించిందని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది. చాంగ్‌పింగ్‌లో వాంగ్జియాయువాన్ జలాశయం పరిసర ప్రాంతంలో రికార్డు స్థాయిలో 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. 1891లో కురిసిన రికార్డు స్థాయి వర్షపాతం 609 మిల్లీమీటర్లు అని, ఈ రికార్డు ఇప్పుడు బద్దలైందని ప్రకటించింది. అంతే కాదు ఆగస్టు నెలలో చైనాకు మరిన్ని తుపానులు తాకే అవకాశం ఉందని హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News