చైనాలో కోర‌లు చాస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. - జూన్ చివ‌రి నాటికి వారానికి 6.50 కోట్ల కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం..!

ఒమిక్రాన్ XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షన్ చెప్పిన‌ట్టు స‌మాచారం.

Advertisement
Update:2023-05-26 14:26 IST

చైనాలో కోవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. కొత్త వేవ్ కార‌ణంగా కొన్ని రోజులుగా అక్క‌డ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి ఇది మ‌రింత తీవ్ర‌మై వారానికి 6.50 కోట్ల కేసులు న‌మోదయ్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. అంత‌ర్జాతీయ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు దీనిని వెల్ల‌డిస్తున్నాయి.

ఒమిక్రాన్ XBB వేరియంట్ కారణంగా చైనాలో ఏప్రిల్ నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే చివరి నాటికి వారానికి 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశముందని అక్క‌డి వైద్య నిపుణులు చెప్పినట్టు స‌మాచారం. అవి తీవ్ర‌మై జూన్ చివ‌రి నాటికి 6.50 కోట్ల మందికి వైర‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని అంచ‌నాలు చెబుతున్నాయి.

2022 డిసెంబర్‌లో చైనా జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోవిడ్ వైరస్ కొత్త వేవ్ లు వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో ఉధృతి కనిపించడం ఇప్పుడేనని చైనాకు చెందిన‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా వైర‌స్ ఉధృతంగా క‌నిపిస్తుండ‌టంతో అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఒమిక్రాన్ XBB వేరియంట్లకు రోగనిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం ఉండటంతో ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో XBB వేరియంట్లను ఎదుర్కొనే టీకాలను అభివృద్ధి చేస్తున్నామని చైనీస్ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నన్షన్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇప్పటికే రెండు టీకాలను తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News