కెనడాలోని భారతీయులకు కేంద్రం జాగ్రత్తలు
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు రోజు రోజుకి పెచ్చుమీరుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య పరమైన పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు, భారత విద్యార్థులకు కేంద్రం తాజాగా కీలక సూచన చేసింది. భారతీయులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఘటనలు వెలుగు చూస్తూ ఉండటంతో భారత విదేశాంగ శాఖ తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలకు విడుదల చేసింది. అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. అంతేకాదు.. కెనడా వెళ్లే భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా కెనడాలోని ఎన్నారైలను ఈ మేరకు హెచ్చరించారు. కెనడా చర్యలను వ్యతిరేకించే భారతీయ దౌత్యవేత్తలు, భారతీయులకు బెదిరింపులు వచ్చే అవకాశం ఉందని, గతంలో అలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలకు సైతం వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. అయితే, కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలు స్థానిక అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఎన్నారైల భద్రత కోసం కృషి చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత రాయబారిపై కెనడా నిషేధం విధించగా, కెనడా రాయబారిని భారత్ బహిష్కరించింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత దిగజారిపోయింది.
అయితే సరిగ్గా 24 గంటల తరువాత తన వ్యాఖ్యలపై కాస్త తగ్గిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. భారత్‌ను రెచ్చగొట్టాలని గానీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని గానీ తమ ప్రభుత్వం చూడటం లేదని పేర్కొన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ కేసు గురించి భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.