భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరించిన కెనడా.. కారణం ఏంటంటే..
కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించలేదు. జీ20 సమావేశాల సమయంలోనే సిక్కు వేర్పాటువాదుల ఆందోళనలపై ప్రధాని మోడీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కెనడా ప్రభుత్వం వాళ్ల దేశం నుంచి బహిష్కరించింది. ఖలిస్తానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో కెనడాలోని ఇండియన్ ఎంబసీలో పని చేసే రా అధికారి ఒకరికి సంబంధం ఉందని ఆరోపిస్తూ.. అతడిని దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సదరు అధికారి పేరును మాత్రం కెనడా ప్రభుత్వం వెల్లడించలేదు. కెనడా తీసుకున్న నిర్ణయంతో భారత్-కెనడాల మధ్య దౌత్యపరంగా మరింత దూరం పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
కెనడా ప్రభుత్వం సోమవారం నిర్వహించిన అత్యవసర పార్లమెంట్ సెషన్‌లో భారత ఇంటెలిజెన్స్ అధికారిపై తీవ్రమైన చర్చ జరిగింది. ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఖలిస్తానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో సదరు రా ఆఫీసర్‌కు బలమైన సంబంధాలు ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని కూడా ట్రూడో ఆరోపించారు.
హర్‌దీప్ హత్యకు సంబంధించి ట్రూడో ప్రభుత్వం అత్యవసర నిర్ణయం తీసుకున్నది. ఒక భారత సీనియర్ దౌత్యాధికారిని కెనడా నుంచి బహిష్కరించాము. అతని పేరు మాత్రం వెల్లడించలేమని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ పేర్కొన్నారు. అయితే సదరు దౌత్య అధికారి భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)కు కెనడాలో చీఫ్‌గా పని చేస్తున్నట్లు మాత్రం తెలిపారు.
భారత ప్రభుత్వం హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్ 18న వాంకోవర్ శివారులోని సర్రే ప్రాంతంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆ ప్రాంతంలో సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్లే ఎక్కువగా నివసిస్తుంటారు. ఇండియాలో టెర్రరిస్టు కార్యకలాపాలకు నిజ్జార్ ప్రయత్నిస్తున్నాడని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నది.
ఈ హత్య తర్వాత ఇండియా-కెనడా మధ్య మాటల యుద్దం పెరిగింది. దౌత్యపరంగా కూడా దూరం పెరుగుతూ వస్తోంది. సిక్ రైట్ వింగ్ కార్యకర్తలను హ్యాండిల్ చేయడంలో కెనడా విఫలమైందని భారత్ ఆరోపిస్తోంది. ఇండియాలో ప్రత్యేక సిక్కు దేశం కోసం కెనడాలో ఆందోళనలు చేస్తున్న కార్యకర్తలపై కెనడా మెతక వైఖరి ప్రదర్శిస్తోందని భారత్ అంటోంది.
భారత్ కూడా తమ రాజకీయ ప్రత్యర్థులను ఇతర దేశాల్లో అంతం చేస్తూ సరికొత్త అవతారం ఎత్తింది. గతంలో సౌదీ అరేబియా కూడా జర్నలిస్టు జమాల్ ఖష్షోగీని టర్కీలో హత్య చేయించింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా తన రాజకీయ ప్రత్యర్థి అయిన నిజ్జార్‌ను కెనడాలో చంపించిందని ప్రధాని ట్రుడో మాజీ సలహాదారు జోసిలిన్ కలోన్ ఆరోపించారు.
కాగా, కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించలేదు. జీ20 సమావేశాల సమయంలోనే సిక్కు వేర్పాటువాదుల ఆందోళనలపై ప్రధాని మోడీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని ట్రుడోతో సమావేశమైన సమయంలోనే వేర్పాటు వాదులపై కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించారు.