ఓటమిని భరించలేక.. ఎగతాళిని సహించలేక.. - ఏడుగురిని హతమార్చిన వైనం
అసలే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఒలివిరా.. వారి నవ్వును సహించలేకపోయాడు. అంతే అతని స్నేహితుడు రెబిరోతో కలిసి వారందరినీ తుపాకీతో బెదిరించాడు.
ఆటలో ఓటమి కంటే.. ఎదుటివారి వారి నవ్వే అతన్ని ఎక్కువగా బాధపెట్టింది.. అసలే రెండుసార్లు ఓడిపోయాననే అవమానంతో కుంగిపోతుంటే.. చుట్టుపక్కల వారు ఎగతాళిగా నవ్వడం అతనిలో అసహనాన్ని పెంచేసింది. ఆపై అతను ఓ మృగంలా మారిపోయాడు. విచక్షణ మరిచి.. నవ్వినవారినందరినీ వరుసగా నిలబెట్టి.. తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో మంగళవారం ఈ ఘోరం జరిగింది.
బ్రెజిల్‌లోని సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా తన స్నేహితుడు రెబిరోతో కలిసి మంగళవారం నాడు స్థానిక పూల్ హాల్‌కి వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో పూల్‌గేమ్ ఆడాడు. ఈ గేమ్ కోసం అతనితో 4 వేల రియాస్ (బ్రెజిల్ కరెన్సీ) పందెం కాసి పోటీలో ఓడిపోయాడు. ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఒలివిరా.. అదే వ్యక్తితో రెండోసారీ పందెం కాసి గేమ్ ఆడాడు. రెండోసారి కూడా ఓడిపోవడంతో పూల్ హాల్‌లో ఉన్నవారంతా అతన్ని చూసి నవ్వారు.
అసలే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఒలివిరా.. వారి నవ్వును సహించలేకపోయాడు. అంతే అతని స్నేహితుడు రెబిరోతో కలిసి వారందరినీ తుపాకీతో బెదిరించాడు. రెబిరో వారందరినీ తుపాకీతో బెదిరిస్తూ వరుసగా నిలబెట్టాడు. అనంతరం ఒలివిరా వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్ యజమాని సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.