భారీ వర్షాలకు అతలాకుతలమైన బ్రెజిల్.. 75 మంది మృతి
బ్రెజిల్ దేశాన్ని వానలు వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
బ్రెజిల్ దేశాన్ని వానలు వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు తోడు భారీగా వరదలు పోటెత్తడంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. పలు నగరాలు నీటమునిగాయి. “రియో గ్రాండే దోసుల్ ” రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య గడిచిన 7 రోజుల నుంచి ఇప్పటి వరకూ 75 మంది కాగా, సుమారు 103 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ పలు చోట్ల హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
వరదలకు ఇప్పటికే 155 మందికిపైగా గాయపడగా సుమారుగా 88 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు అధికారిక సమాచారం. అలాగే 16 వేల మందికి స్కూళ్లు, ఇతర సురక్షిత ప్రాంతాలలో తాత్కాలిక వసతి కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారుగా 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని ఈ వరదలు ప్రభావితం చేశాయి, వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి.
వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఒక చిన్న జలవిద్యుత్ కేంద్రం వద్ద డ్యామ్ పాక్షికంగా కూలిపోవడం కూడా జరిగింది. దీంతో సుమారు నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. 8 లక్షలకు మందికి పైగా ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోర్టో అలెగ్రే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అన్ని విమానసర్వీసులను నిలిపివేసారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఎ బ్రెజిలియన్ జియోలాజికల్ సర్వీస్ ప్రకారం కొన్ని నగరాల్లో కురిసిన వర్ష పాతం దాదాపు 150 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేసినట్టు చెబుతున్నారు.