ఆత్మహుతి దాడి వెనుక రా - పాకిస్తాన్ సంచలన ఆరోపణలు

బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెనుక‌ భారత నిఘా విభాగమైన `రా` పాత్ర ఉంద‌న్న‌ కోణంలో తమ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయన్నారు.

Advertisement
Update:2023-10-01 14:25 IST

మహ్మద్‌ ప్రవక్త జయంతి ఊరేగింపు సందర్బంగా జంట ఆత్మహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్‌ రాష్ట్రంలోని మస్తుంగ్‌ జిల్లాలోని మదీనా మసీదు వద్ద జరిగిన దాడిలో మృతుల సంఖ్య 65కు చేరింది. ఈ ఘటన తర్వాత గంటల వ్యవధిలోనే ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని హంగూ నగరంలో మరో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మొత్తానికి ఈ రెండు పేలుళ్లలో మృతుల సంఖ్య 70కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ పేలుళ్ల వెనుక భారత్‌ హస్తం ఉందని పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్‌రాజ్‌ బగ్టీ ఆరోపించారు. నిందితుడి గురించి తెలుసుకునేందుకు అతడికి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపారు.

బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెనుక‌ భారత నిఘా విభాగమైన `రా` పాత్ర ఉంద‌న్న‌ కోణంలో తమ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయన్నారు. మస్తుంగ్‌ ఆత్మాహుతి దాడిని ప్రతిఒక్కరు ఖండిచాలని పిలుపునిచ్చారు. దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించుకోలేదు. అయితే సాధారణంగా పాకిస్తాన్‌లో తెహ్రీక్‌-ఐ-తాలిబన్‌ పాకిస్తాన్‌ ఉగ్రసంస్థ తరచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంది.

ఈ దాడులను ఖండించిన బలూచిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. అయితే ఈ దాడులు తామే చేశామంటూ ఎవరు ప్రకటించకపోవడంతో పాక్ భారత్ పై ఆరోపణలకు దిగింది.

ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు భారత్, కెనడాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పాక్ ఆరోపణల నేపథ్యంలో అసలే అంతంత మాత్రంగా ఉండే పాక్- ఇండియా సంబంధాలు మరింతగా దెబ్బతినే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News