టీవీ ఛానల్‌ లైవ్‌లో తుపాకులతో హల్‌చల్‌

సాయుధులై ఛానల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు.

Advertisement
Update:2024-01-10 12:01 IST

టెలివిజ‌న్‌ న్యూస్‌ ఛానల్‌ లైవ్‌లో దుండగులు తుపాకులతో హల్‌చల్‌ చేశారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో బలవంతంగా టీసీ టీవీ ఛానల్‌ లైవ్‌ స్టూడియోలోకి ప్రవేశించిన వీరు ఉద్యోగుల తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు దిగారు. 15 నిమిషాల పాటు టీవీ లైవ్‌లోనే తీవ్ర కలకలం సృష్టించారు. ఈక్వెడార్‌ దేశ రాజధాని గ్వయకిల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

లైవ్‌లో తుపాకీ శబ్దాలు...

సాయుధులై ఛానల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఛానల్‌ను చుట్టుముట్టారు. దుండగులు తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద చర్యల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు.

డ్రగ్‌ గ్యాంగ్‌స్టర్ల పనేనా..?

ఇటీవల ఈక్వెడార్‌లోని జైళ్ల నుంచి ఇద్దరు డ్రగ్‌ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. టీవీ ఛానల్‌ ఘటన కూడా అందులో భాగమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై టీసీ టీవీ ఛానల్‌ అధిపతి మాన్రిక్‌ మాట్లాడుతూ.. దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు తాను కంట్రోల్‌ రూములో ఉన్నానని, వారిలో ఒకరు తన దగ్గరకొచ్చి తలపై తుపాకీ గురిపెట్టాడని, నేలపై కూర్చోవాలని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనతో తానింకా షాక్‌లోనే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తోందని చెప్పారు.

దేశాధ్యక్షుడి కీలక ఆదేశాలు..

గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్న అనంతరం ఈక్వెడార్‌లో కొన్ని రోజులుగా వరుస దాడులు జరుగుతుండటం, ఉన్నతాధికారులను అపహరించడం వంటివి జరుగుతున్నాయి. దీంతో దేశాధ్యక్షుడు డేనియల్‌ నోబోవా సోమవారం ఎమర్జెన్సీ విధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు. అంతలోనే మంగళవారం జరిగిన టీవీ ఛానల్‌ ఘటనతో ఆయన మరో కీలక ప్రకటన చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే 20 ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. వీటికి చెందిన సభ్యులు ఎక్కడ కనిపించినా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హతమార్చేందుకు సైనికులకు అధికారం ఇచ్చారు. దేశం ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణలను ఎదుర్కొంటోందని ప్రకటించారు. దేశంలో శాంతిని పునరుద్ధరించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News