అమెజాన్ లో మళ్లీ ఉద్యోగాల కోత..

గతేడాది నవంబర్ లో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్. అప్పటికి అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది. ఏకమొత్తంగా 18వేలమందికి ఉద్వాసన లెటర్లు రెడీ చేసింది.

Advertisement
Update:2023-01-06 07:28 IST

15 లక్షల 40వేలమంది ఉద్యోగులు ఉన్న కంపెనీ అది. అందులో 18వేల మందిని తొలగించడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ అసలు ఉద్యోగుల్ని తొలగించాల్సిన అవసరం లేని కంపెనీ అది. ప్రపంచ వ్యాప్త ఆదరణ సంపాదించి, ఇతర రంగాల్లో కూడా విస్తరిస్తూ లాభాలను ఆర్జిస్తున్న సంస్థ అమెజాన్. అలాంటి అమెజాన్ సంస్థ కూడా ఆర్థిక సంక్షోభాల వల్ల లేఆఫ్ ప్రకటించింది. ఒకేసారి 18వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ లే ఆఫ్ యూరప్ దేశాల్లో అమలవుతున్నా.. భారతీయ మూలాలున్న ఎంతోమంది బాధితులుగా మారుతున్నారు.

నవంబర్ లో 10వేల ఉద్యోగాల కోత..

గతేడాది నవంబర్ లో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది అమెజాన్. అప్పటికి అదే పెద్ద లే ఆఫ్. ఇప్పుడు ఉద్యోగులపై అంతకంటే పెద్ద పిడుగు వేసింది. ఏకమొత్తంగా 18వేలమందికి ఉద్వాసన లెటర్లు రెడీ చేసింది. ఈ వ్యవహారం గుట్టు చప్పుడుగా జరగాల్సి ఉన్నా.. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి దీన్ని లీక్ చేశారు. దీంతో అధికారికంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. 18వేలమందిని తొలగిస్తున్నట్టు అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ప్రకటించారు.

ఆర్థిక సంక్షోభం..

అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగించడం అంటే.. కచ్చితంగా ఆ ప్రభావం ఇతర చిన్న కంపెనీలపై పడుతుంది. మిగతా సంస్థలు కూడా అదే బాట పడతాయి. అమెజాన్ ని సాకుగా చూపి ఉద్యోగుల మెడపై కత్తి పెడతాయి, లేదంటే జీతాల పెంపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయి. ఈ రెండూ ఉద్యోగులకు నష్టాన్ని కలిగించేవే. కానీ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఐటీ, ఐటీ ఆధారిత ఇతర సంస్థలపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అందుకే ఉద్యోగుల్ని తొలగించక తప్పలేదని అంటున్నాయి ఆయా కంపెనీలు. కానీ ఒకేసారి ఇలా 18వేలమందిని ఇంటికి పంపిస్తే.. వారికి ప్రత్యామ్నాయం ఏంటనేది మాత్రం ప్రశ్నార్థకమే.

Tags:    
Advertisement

Similar News